నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
వరంగల్ అర్బన్: అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నగరవాసులకు మెరుగైన సేవలు అందించాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తమతమ విభాగాల పనితీరును వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల మరమ్మతులు పక్కాగా చేపట్టాలని మేయర్, కమిషనర్‌లు ఆదేశించారు. వర్షాల సమయంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. సాధారణ, 15వ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ తదితర నిధులతో చేపట్టిన, కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చర్ విభాగం ద్వారా నర్సరీల నిర్వహణ, అమృత్ 2.0, వన మహోత్సవం తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం 37 మంది సఫాయి మిత్ర కార్మికులకు, సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లకు పీపీఈ కిట్లను అందజేశారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డును తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
మేయర్ గుండు సుధారాణి,
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్


