
వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
వరంగల్ అర్బన్: నగరంలో వీధి దీపాలు,సెంట్రల్ లైటింగ్ నిర్వహణలో నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లైటింగ్ నిర్వహణలో బ్లాక్‌స్పాట్ల గుర్తింపుతోపాటు అందుకు అవసరమైన సామగ్రి, పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. నగర వ్యాప్తంగా ఉన్న 83,750 వీధి దీపాలు వెలగాలని, విలీన గ్రామాల్లో అంధకారం లేకుండా పర్యవేక్షించాలన్నారు. నీటి సరఫరా తీరును సమీక్షించిన మేయర్.. ప్రతి ఇంటికి నీటి సరఫరా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు లీకేజీలను అరికట్టాలని పేర్కొన్నారు. నీరు అందని చివరి ఏరియాలు, నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్ బాబు, మాధవీలత, డీఈ కార్తీక్‌రెడ్డి, ఏఈ సరిత తదితరులు పాల్గొన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణి