
గోదావరి తీరం.. భక్తప్రవాహం
సరస్వతీనది పుష్కర స్నానాలకు భక్తుల రద్దీ
● హైకోర్టు జడ్జి, ఎస్‌ఐబీ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ డీజీ పుష్కర స్నానం, దర్శనం
● 50వేల మంది వరకు భక్తులు పుష్కర స్నానాలు
● తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ కొనసాగింపు..
● ఆరో రోజు స్వల్పంగా తగ్గిన భక్తులు
● ముక్తీశ్వరస్వామి ఆలయ క్యూలైన్‌లో బారులుదీరిన భక్తజనం
భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఆరో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి తరలొచ్చి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రదాన పూజలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గోదావరితీరం వద్ద భక్తప్రవాహం కనిపించింది. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు.
కలెక్టర్, ఎస్పీ పరిశీలన
పుష్కరాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు, సింగరేణి, గజ ఈతగాళ్లును ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే వాకీటాకీలతో మాట్లాడుతూ పరిశీలించారు. టెంట్‌సిటీ, ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారుల్లో బ్లీచింగ్ చల్లించి పరిస్థితిని చూశారు. పుష్కర ఘాట్ గోదావరిలో బోటు ద్వారా భద్రతను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో అదనంగా చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. ఎస్పీ ట్రాఫిక్ నియంత్రణను పకడ్బందీగా చేట్టాలని ఆదేశించారు.
అష్టమితో తగ్గిన రద్దీ..
మంగళవారం అష్టమి సందర్భంగా భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఉదయం 10గంటల వరకు భక్తుల రద్దీ లేదు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలొచ్చాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లతో నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది.
రోడ్లు శుభ్రం..
ఆదిముక్తీశ్వరస్వామి నుంచి వీఐపీ ఘాట్ వెళ్లే మార్గంలో వర్షం పడితే రోడ్లపై దిగబడకుండా గ్రావెల్ చిప్స్ వేశారు. రోడ్లపై దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీటిని చల్లుతున్నారు. గోదావరితీరం, ఆలయ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్‌లు, ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు చురుగ్గా చేపట్టారు.
50వేల మంది స్నానాలు..
వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్‌లో బారులుదీరారు. మంగళవారం 50వేల మంది వరకు పుష్కర స్నానాలు చేసి దర్శనాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా. పలువురు భక్తులు అక్కడక్కడ వడదెబ్బకు గురయ్యారు. వారిని కాళేశ్వరం పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలందించారు. కొంత మందిని ఇతర పట్టణాలకు తరలించి వైద్యసేవలందించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
మజ్జిగ ప్యాకెట్లు అందజేత..
భక్తులకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిక ప్యాకెట్లు అందించారు. ప్రధాన తూర్పు, దక్షిణ ద్వారాల ద్వారా క్యూలైన్లలో భక్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ప్రత్యేకాధికారిగా మనోహర్‌ను నియమించారు. ఆయన క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేపట్టారు.
సరస్వతీనది పుష్కరాలకు ప్రముఖులు హాజరయ్యారు. హైకోర్టు జడ్జి సృజన, ఎస్‌ఐబీ డైరెక్టర్ తరుణ్‌జోషి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పుష్కర స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
నదీహారతి ప్రత్యక్ష ప్రసారం..
సరస్వతి ఘాట్‌లో కాశీపండితులతో ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. రాత్రి 7.30 గంటలకు 45 నిమిషాల పాటు జరిగే ఈకార్యక్రమాన్ని పుష్కరాలు పూర్తయ్యే వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కాశీ పండితులు ఏడుగురితో తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నారు. రోజురోజుకూ పరిసర ప్రాంతాల భక్తులు వీక్షించడానికి తరలి వస్తున్నారు. రాత్రి 9 వరకు కూడా వరకు భక్తులు ఆయా పరిసరాల్లో కాలక్షేపం చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి.
ప్రముఖుల పూజలు..

గోదావరి తీరం.. భక్తప్రవాహం

గోదావరి తీరం.. భక్తప్రవాహం

గోదావరి తీరం.. భక్తప్రవాహం

గోదావరి తీరం.. భక్తప్రవాహం

గోదావరి తీరం.. భక్తప్రవాహం

గోదావరి తీరం.. భక్తప్రవాహం

గోదావరి తీరం.. భక్తప్రవాహం

గోదావరి తీరం.. భక్తప్రవాహం

గోదావరి తీరం.. భక్తప్రవాహం