
పది రోజులుగా టెంట్‌కిందనే..
పాలకుర్తి టౌన్: ఆయన యోగా గురువు. ఎంతోమందికి యోగా నేర్పాడు. ఏనాడూ డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అద్దె ఇల్లు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. చివరికి అనారోగ్యంతో చనిపోగా, ఇంటి యజమాని ఒప్పుకోకపోవడం, పది రోజుల కార్యక్రమాలయ్యే వరకు రావద్దని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఖాళీ ప్లాట్‌లో టెంట్‌వేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పది రోజులుగా అదే టెంట్‌లో కాలం గడుపుతున్నారు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండల కేంద్రం, చుట్ట పక్కల గ్రామాల్లో ఒకప్పుడు ఎల్‌ఎన్ టైలర్‌గా దార్ల లక్ష్మీనారాయణ ఓ వెలుగు వెలిగాడు. డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా యోగా గురువుగా ఎంతోమంది కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. పది రోజులక్రితం అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. మృతదేహం ఉంచేందుకు ఇంటి యజమాని ఒప్పుకోలేదు. దీంతో వారికున్న ఖాళీ స్థలంలో(ప్లాట్)లో టెంట్ వేసి దహనసంస్కారాలు నిర్వహించారు. పది రోజుల వరకు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆ టెంట్‌కు చుట్టూ పరదాలు కట్టుకొని కాలం వెళ్లదీస్తూ మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఈదురుగాలులు, వర్షం పడుతున్నా టెంట్‌కిందనే జీవనం సాగిస్తున్న దైన్యం. దశదిన కర్మ కార్యక్రమానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారని ఆశగా చూస్తున్నట్లు కుమారుడు దార్ల ఉపేందర్ తెలిపాడు.
మృతదేహంతో ఇంటికి రావద్దని యజమాని
కాలం చేసిన భర్త అంతిమ కార్యక్రమాలు టెంట్‌కిందనే..