
ఎస్సై సంతకం ఫోర్జరీ..
● ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్.. సీపీ ఉత్తర్వులు జారీ
● తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌లో సంఘటన
వరంగల్ క్రైం: జనగామ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఏకంగా ఎస్సై సంతకం ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. తరిగొప్పుల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సురేష్, రాజు కానిస్టేబుళ్లు ఇటీవల స్టేషన్ బెయిల్ విషయంలో అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న శ్రీదేవి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆ కాగితాలను కోర్టుకు సమర్పించారు. గుడుంబా అమ్ముతున్న ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ప్రాసెస్ చేయాల్సిందిగా ఎస్సై శ్రీదేవి అదే స్టేషన్ రైటర్‌ను ఆదేశించారు. దీనిని అవకాశం తీసుకున్న సదరు రైటర్‌తోపాటు మరో కానిస్టేబుల్ డబ్బులకు ఆశపడి, ఎస్సై ఆదేశాలను అవకాశంగా తీసుకుని ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి స్టేషన్ బెయిల్ మంజురు చేశారు. ఆ తరువాత ఆ కేసుకు సంబంఽధించిన కాగితాలను కోర్టుకు సమర్పించారు. ఆలస్యంగా తన సంతకం ఫోర్జరీ అయ్యిందని గ్రహించిన ఎస్సై శ్రీదేవి వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. విచారణ జరిపిన అధికారులు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు నివేదిక సమర్పించడంతో కానిస్టేబుళ్లు సురేష్, రాజులపై సీపీ రెండు రోజులక్రితం సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మారని తీరు..
సంవత్సరాల తరబడి శిక్షణాలు పూర్తి చేసిన పోలీస్ అధికారులు కాసుల కక్కుర్తి కోసం అడ్డదారులు తొక్కుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పోలీస్‌శాఖ పరువు బజారున పడుతోంది. కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు హత్య కేసుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రధాన నిందితులుగా ఉండడం గమనార్హం. ఇటీవల సస్పెండ్‌కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గతంలోనూ అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కావడం కొసమెరుపు. గతంలో హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, శాయంపేట పోలీస్ స్టేషన్, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ వసూళ్లకు పాల్పడి సస్పెండ్ అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఉన్నతాధికారులు తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలు కూడా బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పోలీస్ శాఖ గాడిన పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంటెలిజెన్స్ డీజీని కలిసిన సీపీ
వరంగల్ క్రైం: తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం హనుమకొండలోని పోలీస్ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తున్న డీజీ శివధర్‌రెడ్డి మార్గమధ్యలో పోలీస్ అతిథి గృహానికి చేరుకున్న సందర్భంగా సీపీ కలిశారు. ఈసందర్భంగా ఇరువురు అధికారులు పలు అంశాలపై చర్చించారు.