
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
రవిని తలపించే మోము.. తారల వెలుగులు నిండిన కనులు.. నుదుటిపై బొట్టు.. తలనిండా మల్లె, కనకాంబర పూలు, నెలవంక కట్టగా నెమలంచు చీర.. కన్నెపిల్లలు చుట్టగా కలువ రేకుల చీర.. ఆరు మూరల చీర కట్టిన అరిందలు.. ఓరుగల్లులో విహరించారు. ఫ్యాన్సీ దుస్తులు వదిలేసి పదహారణాల తెలుగమ్మాయిల్లాగా మారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేశారు. రెడ్‌కార్పెట్‌పై హొయలొలుకుతూ చిరునవ్వులతో తమ అందాలను ఆరబోశారు.
● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు
● ఫ్యాన్సీ డ్రెస్‌లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు
● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు
● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు
● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు
● సుందరీమణుల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు
సాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(కె) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. ఈ సందర్భంగా హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హరిత కాకతీయలో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. కోనేరు ముందు నుంచి వెళ్తూ తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. 44 నిమిషాల పాటు ఆలయంలో సందడి చేశారు. అనంతరం నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చుని పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్‌తో సందడి చేసి, ఆ తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారికి సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్బగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశ్వీరచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్‌కు బయలుదేరి వెళ్లారు.
కోట చారిత్రక అందాలకు ఫిదా..
విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్‌ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండిక్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించగా ఆసక్తిగా విన్నారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నల్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన ఆద్భుతమైన శిల్ప కళ సంపదను మరింత ఆసక్తిగా తిలకించారు. అనంతరం కాకతీయుల కళాఖండాలను తమ సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్‌లో ప్రదర్శించగా.. కాకతీయ వంశ చరిత్ర, రాణి రుద్రమదేవి పోరాట పటిమ, వీరత్వం స్పష్టం చేయగా.. విశ్వసుందరీమణులు ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. కట్టడం విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని ఇంటాక్ నిర్వాహకులు, పర్యాటకశాఖ అధికారులు వివరించారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో విద్యుత్ వెలుగుల నడమ పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్‌తో కూడిన బహుమతులను అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రామప్ప అందాలు వీక్షించి..
రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్‌వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుమ్మాయిల్లా ముస్తాబయ్యారు. సరస్సుకట్టపై ఫొటోలు దిగారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేష్‌లు వివరించగా శిల్పాకళాసంపదను తమ సెల్‌ఫోన్‌లో బంధించుకున్నారు. ఆలయం చుట్టూ హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆలయ ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం రామప్ప గార్డెన్‌లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. చివరగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు మంత్రి సీతక్క జ్ఞాపికలు అందించారు. సుందరీమణుల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ‘ఆక్టోపస్’ బృందాలను రంగంలోకి దింపారు.
సుందరీమణుల పర్యటన
మరిన్ని ఫొటోలు – 8లో

కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు