
పదేళ్ల విధ్వంసాన్ని ప్రజలు మరిచిపోరు
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలుగా చేసి సృష్టించిన విధ్వంసాన్ని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి చేసిందేమిటో చెప్పకుండా పింక్ బుక్, రెడ్‌బుక్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. పదేళ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం రేవంత్‌రెడ్డి 16 నెలల హయాంలో చేశారని అన్నారు. వారు చేయలేనివి, మేము చేసినవి ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని అనేక సార్లు చెప్పామని అన్నారు. చందాలు వసూలు చేసిన వందల కోట్లతో పెట్టే సభను ప్రజలు బహిష్కరించాలని కోరారు. హనుమకొండ జిల్లాలో సభ పెట్టి, చలో వరంగల్ అనడం హాస్యాస్పదం అన్నారు. బీఆర్‌ఎస్ ఉనికి చాటుకోవడానికే సభ, కబ్జాలు చేయడం, కాళ్లు మొక్కడం ఆ పార్టీ నాయకుల పని అంటు ఎద్దేవా చేశారు. నాడు కొండా మురళి గోడ కుర్చీ వేయించిన విషయాన్ని కొందరు నాయకులు మరిచిపోయి నేడు నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ కలలు కంటుందని, అవీ దింపుడు కల్లం ఆశలేనని అన్నారు. సమావేశంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేటర్ విజయశ్రీరజాలీ, నాయకులు మండల సమ్మయ్య, కౌటిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.