
ఓబీసీ డిక్లరేషన్‌కు మేయర్ సుధారాణి హాజరు
వరంగల్ అర్బన్: న్యూ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐఈ)లో సోమవారం ఓబీసీలపై జరిగిన క్లోజ్ డోర్ సమావేశానికి మేయర్ సుధారాణి హాజరయ్యారు. దేశ వ్యాప్త కుల గణన కోసం ఎంపీ రాహుల్ గాంధీ విశేషంగా కృషి చేస్తున్నారని మేయర్ తెలిపారు. ఓబీసీల సమస్యల్ని సమావేశం దృష్టికి తీసుకెళ్లి నట్లు మేయర్ తెలిపారు. కులగణన, ఉపవర్గీకరణ, పదోన్నతుల్లో రిజర్వేషన్, సామాజిక న్యా యనమూనా ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.
టీచర్ల శిక్షణ శిబిరం మార్పు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో మంగళవారం(నేడు) నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణకు సంబంధించి శిబిరాన్ని హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వద్ద గ్రీన్‌వుడ్ పాఠశాలకు మార్చి నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు, అలాగే ఉమ్మడి జిల్లాలోని భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు తొలుత పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో శిక్షణ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనివార్యకారణాలతో శిక్షణ వేదిక మార్చినట్లు పేర్కొన్న డీఈఓ.. ఈ విషయాన్ని సంబంధిత ఉపాధ్యాయులు గమనించాలని కోరారు.
మందుల సరఫరాలో
అప్రమత్తంగా ఉండాలి
ఎంజీఎం: మందుల సరఫరాలో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఫణీంద్రరెడ్డి అన్నారు. సోమవారం ఆయన హనుమకొండ సెంటర్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఫణీంద్రరెడ్డి మాట్లాడుతూ.. సీఎంఎస్ అధికారులు ఆస్పత్రుల వైద్యాధికారులతో సమన్వయంగా ఉంటూ.. మందుల కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎంఎస్‌లో మందుల నిల్వ గదులను పరిశీలించి వాక్సిన్ కూలర్‌లో వ్యాక్సిన్లు, మందుల నిల్వలు, ఉష్ణోగ్రతల వివరాలను సీఎంఎస్ ఇన్‌చార్జ్ ఫార్మసీ ఆఫీసర్ల్లు ఉప్పు భాస్కర్, నళినిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ దేవేంద్రకుమార్, ఈడీ కౌటిల్య, ఈఈ కేఎస్‌కే ప్రసాద్ తదితరులున్నారు.
వైద్యులపై చర్యలు షురూ..
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో పేద ప్రజలకు అందుతున్న సేవలపై మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టిన అనంతరం శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. ఆస్పత్రిలో అత్యవసర సేవా విభాగం, మెడికల్ స్టోర్, రోగులకు అందించే ఆహారం, పిల్లల వార్డును సందర్శించిన నేతలు రోగులకు అందించే సేవల్లో లోపం ఉన్నట్లు గుర్తించి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పలు విభాగాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది లేని విషయాన్ని గుర్తించి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి.. సూపరింటెండెంట్ కిషోర్‌ను అక్కడే ప్రశ్నించారు. అనంతరం ఫోన్‌లో కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ అటెండెన్స్‌ను కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 77 మంది వైద్యులు, సిబ్బందికి సోమవారం ఎంజీఎం పరిపాలనాధికారులు మెమోలు జారీ చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి మెమోలు జారీ చేయడం ఎంజీఎం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
నకిలీలపై దాడులు చేయాలి
● ‘చాంబర్’ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి
వరంగల్ చౌరస్తా : రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసి మోసగిస్తున్న సంస్థలు, షాపులపై దాడులు చేసి అన్నదాతలకు నాణ్యమైన పత్తి విత్తనాలు సరఫరా చేయాలని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సీఎస్‌కు, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ అధికారులు వివిధ విత్తన సంస్థలు, ఏజెన్సీలు, షాపులపై దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల సరఫరాను నిరోధిస్తున్నారని వివరించారు.