వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు పీడీ, పీఈటీ, సీనియర్ క్రీడాకారులు వచ్చే నెల 15 వరకు హనుమకొండ ఇండోర్ స్టేడియంలోని డీఎస్‌ఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నెల రోజులపాటు శిబిరాలను నిర్వహించే శిక్షకులకు గౌరవ వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కొనసాగే శిక్షణ శిబిరాలను గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
రెండు రోజులపాటు
జాతీయ కాన్ఫరెన్స్
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాలలో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి, కన్వీనర్ డాక్టర్ పి.అరుణ, కోకన్వీనర్ కవిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇంటర్ డిసిప్లినరీ మెటీరియల్స్ సైన్స్ ఫర్ సస్టయినబుల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్’అంశంపై ఈ జాతీయ కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ పి.ప్రావీణ్య, నిట్ ఫిజిక్స్ ప్రొఫెసర్ హరినాఽథ్ కీలక ఉపన్యాసం చేస్తారని, నెహ్రూ యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆన్వేశ్, సీసీఈటీ ఏజీఓ ప్రొఫెసర్ బాలభాస్కర్ పాల్గొంటారని వివరించారు.
ఐఎస్‌ఎఫ్‌తో నిట్ ఒప్పందం
కాజీపేట అర్బన్: ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్‌ఎఫ్) కర్నాటకతో నిట్ వరంగల్ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ కార్యాలయంలో డైరెక్టర్ బిద్యాధర్ బిద్యాధర్ సుబుదీ, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జేఏ చౌదరి పరస్పర ఒప్పందపత్రాలను అందజేసుకున్నారు. కాగా, స్టార్టప్‌ల అభివృద్ధికి ఎంఓయూ తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు.
పరీక్షల ఫీజు చెల్లింపునకు
గడువు ఏప్రిల్ 2
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలకు సంబంధించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల 2,4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజులు చెల్లించేందుకు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 2వరకు గడువు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య తెలిపారు. ఏప్రిల్, మేలో పరీక్షలు నిర్వహించనున్నారని, వివిధ కోర్సుల ఫీజుల వివరాలు, పూర్తి సమాచారం కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు.
మే1 నుంచి ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు