ఖిలా వరంగల్: వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పత్తుల మేళా ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల నేతృత్వంలో మంగళవా రం నుంచి 27వ తేదీ వరకు మేళా జరగనుంది. జిల్లాలోని రైతులు ఉత్పత్తి చేసిన గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర ఆల్పాహారాలు, అందం, ఆరోగ్య సంరక్షణ.. ఇలామరెన్నో ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లాలోని ప్రజలందరినీ మేళాకు ఆహ్వానిస్తున్నారు. సహజ సిద్ధమైన, మేలైన ఉత్పత్తులను ఆసక్తి ఉన్న ప్రజలు కొనుగోలు చేసేందుకు 42 స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను మేళా ద్వారా అధిక రాబడి పొందడానికి స్టాళ్లలో విక్రయించుకునే అవకాశం కల్పించారు. ప్రజలకు ఆయా ఉత్పత్తులపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ అందించే ప్రోత్సాహకాలను అధికారులు వివరించనున్నారు. వ్యవసాయ సాగుకు ఉపయోగపడే అన్ని రకాలు పరికరాలు, పనిముట్లు ప్రదర్శనలో ఉంచనున్నారు. వీటిలో ప్రధానంగా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానం పొందడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులు, పంట రుణాలు పొందేందుకు అవగాహన కల్పించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
రైతు ఉత్పత్తుల మేళా ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు, ఏసీపీ తిరుపతి, ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఏఓ రవీందర్‌రెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి..
వరంగల్: వరంగల్ నక్కలపల్లి రోడ్డులోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 25నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘తెలంగాణ రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా’ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా వ్యవసాయధికారి కె.అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 40 రైతు ఉత్పత్తిదారు సంఘాల ఉత్పత్తులను స్టాళ్లలో ప్రదర్శించడంతోపాటు అమ్మకాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహణ
వరంగల్ నక్కలపల్లి రోడ్డులోని
జీఎం కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు
42 స్టాళ్లపై గృహ, వంటగది
అవసరాలు, ఆరోగ్యకర అల్పాహారాలు, తదితర ఉత్పత్తుల ప్రదర్శన
మేళా ఏర్పాట్లు పరిశీలించిన
కలెక్టర్ సత్యశారద