హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
ఎంజీఎం : సకాలంలో వైద్యపరీక్షలతోపాటు క్రమం తప్పకుండా మందుల వాడకం వల్ల క్షయవ్యాధి నిర్మూలించవచ్చని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైనది కాదని, వ్యాధి నిర్మూలన డాక్టర్లు సిఫారసు చేసిన ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. సకాలంలో పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో 26 ప్రభుత్వ ఆస్పత్రులు కలుపుకొని సేవలందించేందుకు మూడు ట్రీట్‌మెంట్ యూనిట్లుగా హనుమకొండ, ముల్కనూరు, పరకాలలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 363 కేసులు గుర్తించినట్లు తెలిపారు. ముందుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉదయం నగరంలోని భద్రకాళిఆలయ ఆర్చినుంచి కేఎంసీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛందంగా సేవలందిస్తామని వైద్యాధికారులు, సిబ్బంది, వైద్య శాఖ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్, అదనపు డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి హిమబిందు, కేఎంసీ ఎస్‌పీఎం విభాగాధిపతి శ్రీధర్, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత తదితరులున్నారు.