వరంగల్ అర్బన్: ప్రజావాణి లక్ష్యం నెరవేరట్లేదు. వారానికి కనీసం 60 నుంచి 80 వరకు దరఖాస్తులు వస్తున్నప్పటికీ చాలా వరకు అర్జీలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. నగరంలో అత్యధికంగా అక్రమ భవన నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, దోమలు, కుక్కలు, కోతులు తదితర సమస్యల పరిష్కారానికి వస్తున్నారు. కానీ.. వాటిలో ఎన్ని పరిష్కారమవుతున్నాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వాటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించట్లేదు. ప్రతీ వారం అర్జీలు పెరుగుతూనే ఉన్నాయి.
గ్రీవెన్స్‌కు 103 అర్జీలు..
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్యారానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో బల్దియా కౌన్సిల్ హాల్ ఆవరణంతా కిక్కిరిసింది. మౌలిక వసతుల కల్పనకు ఇంజినీరింగ్ సెక్షన్‌కు 16, ప్రజారోగ్యానికి 15, పన్నుల విభాగానికి 20, అక్రమ భవన నిర్మాణాలు, అనధికారిక కట్టడాలపై టౌన్ ప్లానింగ్‌కు 45, తాగునీటి సరఫరా సమస్యలపై 7 ఇలా మొత్తం 103 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, బయాలజిస్ట్ మాధవరెడ్డి, సెక్రటరీ అలివేలు, హెచ్‌ఓ రమేశ్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదుల్లో కొన్ని..
● 29వ డివిజన్ మోక్షారామం హిందూ శ్మశాన వాటిక ప్రహరీ కూలిపోయిందని తిరిగి నిర్మించాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సదాంత్ వినతిపత్రాన్ని అందజేశారు.
● 29వ డివిజన్ రఘునాథ్ నగర్ కాలనీలో హోల్డర్ నంబరు రద్దు చేసి పర్మినెంట్ నెంబర్ వేయాలని సీపీఎం నాయకులు అరూరి రమేశ్ తదితరులు ఫిర్యాదు ఇచ్చారు.
● హంటర్ రోడ్డులో 2 నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● మామునూరులో నివాసాల నడుమ రోడ్డుపై కంకర కుప్పలు, ఇసుక వేసి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
● 15వ డివిజన్‌లో నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి మూడు నెలలు గడిచినా ఇంత వరకు వెరిఫికేషన్ చేయడం లేదని సుప్రియ కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.
● 16వ డివిజన్ గొర్రెకుంట హరిహర ఎస్టేట్ 60 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురవుతోందని ఇప్పటి వరకు 13 సార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని బాబురావు వినతిపత్రం అందించారు.
● హనుమకొండ నయీంనగర్ ఇంటి నంబరు 2–1–315కు గతేడాది ఆస్తి పన్ను రూ.1,856 ఉండగా, ఈ ఏడాది రూ.10,187 చెల్లించాలని నోటీసు అందించారని భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు.
● వరంగల్ గాంధీనగర్‌లో ఆస్తి పన్ను అధికంగా నమోదైందని, తగ్గించాలని పంచగిరి రమేశ్ విన్నవించారు.
● 50వ డివిజన్ బృందావన్ కాలనీలో కుక్కల బెడద ఉందని నివారించాలని శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
● 8వ డివిజన్‌లో అనధికారిక నిర్మాణాల్ని అరికట్టాలని కార్పొరేటర్ బైరి లక్ష్మీకుమారి ఫిర్యాదు చేశారు.
బల్దియా గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు
వ్యయ ప్రయాసలు.. సమయం వృథా
కాళ్లరిగేలా తిరిగినా అధికారుల తీరు మారట్లేదని ప్రజల ఆందోళన