వరంగల్ అర్బన్: పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే విజ్ఞప్తి చేశారు. సోమవారం మండిబజార్‌లో ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌కు చెందిన రూ.1,57 లక్షల చెక్కును కమిషనర్ స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024– 25 ఆర్థిక సంవత్సర పన్నులు చెల్లించడానికి కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. నగరావాసుల సౌకర్యార్థం గ్రేటర్ వరంగల్ నగర పరిధి లో ఉన్న 10 ఈ–సేవ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. కాజీపేట సర్కిల్ కార్యాలయం, సుబేదారి వాటర్ ట్యాంక్, హనుమకొండ నక్కలగుట్ట వాటర్ ట్యాంక్, హనుమకొండ అశోకా హోటల్ ఎదురుగా ఉన్న మీసేవ కేంద్రం, హనుమకొండ నయీంనగర్, హనుమకొండ బల్దియా ప్రధాన కార్యాలయం, వరంగల్ పోచమ్మమైదాన్ ఈ సేవ, వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయం, వరంగల్ హెడ్ పోస్టాఫీస్, వరంగల్ కరీమాబాద్ ఈ సేవ కేంద్రంలో పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో చెల్లించేవారు డబ్ల్యూడబ్ల్యూడబ్యూ.జీడబ్ల్యూఎంసీ.జీవోవీ. ఇన్ ద్వారా పన్నులు చెల్లించాలని కోరారు. సకాలంలో పన్నులు చెల్లించకపోతే ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసూనారాణి, ఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఆర్‌ఐ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే