
ఒకే దేశం, ఒకే ఎన్నిక నష్టమే..
కేయూ క్యాంపస్: భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతీయ సమాజానికి ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నష్టదాయకమని ప్రముఖ సామాజిక వేత్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారత సమాజంలో సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోదన్నారు. దేశంలోని విభిన్న జాతులు, కులాలు, మతాలు, బహుళ సంస్కతి, సంప్రదాయాలతో కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యానికి సంకీర్ణ ప్రభుత్వాలతోనే రక్షణ సాధ్యమని ఆయన అన్నారు. నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు తెచ్చి సమాజాన్ని శాసీ్త్రయంగా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే రాజకీయ పార్టీల ప్రధాన కర్తవ్యంగా ఉండాలన్నారు. నేటి రాజకీయ పార్టీలు కార్పొరేట్ శక్తుల ధన ప్రలోభాలకు లోనై ఓటర్లను ప్రభావితం చేయడం ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదకరమన్నారు. 1960 దశకం చివరి నుంచి దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిందన్నారు. 1991లో దేశంలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, గ్లోబలైజేషన్ ప్రభావంతో సమాజంలో మానవీయ సంబంధాలు కనుమరుగై, మార్కెట్ సంబంధాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థల్లో మార్పు తీసుకొచ్చేందుకు కార్పొరేట్ శక్తులతో ఏర్పడిన అసమాన సమాజాన్ని తొలగించేందుకు మానవీయ శాస్త్రాలు, రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యత అవసరమన్నారు. నేటితరం విద్యార్థులు సమాజ అభివృద్ధి కోసం ప్రశ్నించేతత్వాన్ని, ప్రజాస్వామిక లక్షణాలను పెంపొందించుకోవాలని హరగోపాల్ సూచించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..
ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని గుల్బర్గా యూనివర్సిటీ యాక్టింగ్ వీసీ ప్రొఫెసర్ శ్రీరాములు అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణమైన పాలన అందిస్తేనే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు, సంకీర్ణ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, ముంబాయి యూనివర్సిటీ ప్రొఫెసర్ జోష్ జార్జ్, సోషల్ సైన్స్ డీన్ మనోహర్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, బీఓఎస్ చైర్మన్ డాక్టర్ గడ్డం కృష్ణ, అధ్యాపకులు సత్యనారాయణ, నాగరాజు, లక్ష్మీనారాయణ, సంజీవ్, భాగ్యమ్మ, లలిత కుమారి, విజయ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రిజిస్ట్రార్ రామచంద్రం ప్రారంభించారు.
సంకీర్ణ ప్రభుత్వాలతోనే
ప్రజాస్వామ్యానికి రక్షణ
ప్రముఖ సామాజికవేత్త
ప్రొఫెసర్ హరగోపాల్