అధికారుల తీరుపై అర్జీదారుల అసంతృప్తి
వరంగల్ అర్బన్: బల్దియా గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య సమన్వయం కొరవడింది. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యల పరిష్కారానికి అర్జీదారులు వారం వారం వచ్చి వినతులు ఇచ్చి వెళ్లడం పరిపాటిగా మారింది. సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్ కార్యక్రమంలో ప్రజల నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వినతులు స్వీకరించారు. ఈ క్రమంలో కమిషనర్ ఆశీనులైన వేదికపైనే కొంతమంది అధికారులు తమ మొబైల్ ఫోన్లను చూడడం, చిట్‌చాట్ చేయడం కనిపించింది. మరికొంతమంది ఉద్యోగులు కునుకు తీయడాన్ని ఫిర్యాదుదారులు గమనించి అసహనం వ్యక్తంచేశారు.
వెల్లువలా ఫిర్యాదులు
గ్రేటర్ గ్రీవెన్‌కు వివిధ విభాగాలకు సంబంధించి 88 ఫిర్యాదులు రాగా.. అందులో ఇంజినీరింగ్ సెక్షన్‌కు 24, ప్రజారోగ్యానికి 4, పన్నుల విభాగం 10, టౌన్ ప్లానింగ్ 46, తాగునీటి సరఫరా 4 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసున్నా రాణి, రాజేశ్వర్, హెచ్‌ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, బయాలజిస్ట్ మాధవ రెడ్డి, పన్నుల విభాగం అధికారి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
● 3వ డివిజన్ ములుగు రోడ్డు కేఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో సొంతంగా విద్యుత్ స్తంభాలు ఏర్పా టు చేసుకున్నా లైట్లు ఏర్పాటు చేయడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లా పైపులైన్లు ఏర్పాటు చేసి, కనెక్షన్లు ఇవ్వాలని కోరారు.
● మడికొండలోని కృష్ణ స్క్రాప్ షాపునుంచి దుర్గంధం వెదజల్లుతోందని, చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
● వరంగల్ 16వ డివిజన్ గొర్రెకుంట మెయిన్ రోడ్డులో బస్‌షెల్టర్ నిర్మించాలని ఆమనగంటి ఏలేంద్ర విజ్ఞప్తి చేశారు.
● మడికొండలోని 1631 సర్వే నంబర్‌లో 770 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని, తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎస్సీ, బీసీ కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● హనుమకొండ కాకతీయ కాలనీ ఫేస్–2లో 10 ఫీట్ల రోడ్డును వెడల్పు చేయాలని స్థానికులు వేడుకున్నారు.
● భీమారంలోని 101 సర్వే నంబర్ వద్ద కమర్షి య ల్ బిల్డింగ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, తాము ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
● 66వ డివిజన్ హసన్‌పర్తిలో ఆక్రమణకు గురైన మహంకాళి ఆలయ స్థలాన్ని రక్షించాలని కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు.
● 43వ డివిజన్ బృందావన కాలనీలో మిషన్ భగీరథ నల్లాలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు.
● కరీమాబాద్ శాకరాశికుంటలో అసంపూర్తిగా నిర్మించిన అండర్ డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని బర్కత్, హబీబ్ కోరారు.