
ప్రభల తరలింపులో ఉద్రిక్తత..
● భారీగా తరలిరావడంతో
గిర్నిబావిలో ట్రాఫిక్ జామ్
● నిలువరించే ప్రయత్నంలో పోలీసుల లాఠీచార్జ్
● పరుగులు తీసిన బీఆర్‌ఎస్,
కాంగ్రెస్ కార్యకర్తలు
● ఐదుగురికి గాయాలు,
బీఆర్‌ఎస్ ఆందోళన
● డీసీపీ అంకిత్ రాకతో పరిస్థితి అదుపులోకి..
సాక్షి, వరంగల్/దుగ్గొండి: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరకు రాజకీయ ప్రభలు (బండ్లు) తరలుతుండగా దుగ్గొండి మండలం గిర్ని బావిలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారిగా తరలిరావడంతో నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీకి పని చెప్పారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభల ఎదుట పేలుస్తున్న షార్ట్ బాణాసంచా బోర్లా పడడంతో రోడ్డు పక్కల వారికి తగిలి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాంబుల పేలుడు శబ్ధం వినిపించడంతో ఫైరింగ్ జరుగుతుందని భ్రమపడిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఒకానొక దశలో ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వాటర్ కేనన్ ప్రయోగించబో యారు. ఏసీపీ కిరణ్‌కుమార్ తన ఏకే 47 గన్ లోడ్ చేసి ఫైర్ చేస్తానని బెదిరించే ప్రయత్నం చేశారు. అనంతరం డీసీపీ అంకిత్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.జాతరకు స్వయంగా వాహనాలు, ప్రభలను పంపించారు. కాగా లాఠీచార్జ్ బాధితులు ఆందోళన నిర్వహించగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అండగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. సీఐ సాయిరమణ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు
కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలివెళ్లే సమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభబండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. అంతేకాని ఈ ఘటనలో ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదన్నారు. కొన్ని ప్రచార మాధ్యమాల్లో ఈ ఘటనలో కాల్పులు జరిగినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఆందోళన కలిగించే రీతిలో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు అప్‌లోడ్ చేసినా, వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..