
బడ్జెట్ అంచనాల్లో ఆలస్యమెందుకు?
వింగ్ అధికారులపై మేయర్, కమిషనర్ల అసహనం
వరంగల్ అర్బన్: ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి గడువు దగ్గర పడింది. అంచనాల తయారీలో ఎందుకు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని మేయర్ గుండు సుధారాణి వింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హద్దు పద్దు లేదు’ కథనానికి స్పందించిన మేయర్, కమిషనర్ వింగ్ అధికారులతో శనివారం సమావేశమై 2025–26 అర్థిక సంవత్సరం సమగ్ర సమాచారంతో బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌కు సంబంధించి వివిధ విభాగాల వారు ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే కమిషనర్‌కు సూచించాలని తద్వారా బడ్జెట్ సమగ్రంగా ఆమోదయోగ్యంగా ఉండేలా రూపకల్పన చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, సెక్రటరీ అలివేలు, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, జేఏఓ సరిత, హెచ్‌ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
మొక్కల పెంపకానికి షెడ్లు ఏర్పాటు చేయాలి..
మొక్కల పెంపకానికి వీలుగా నర్సరీల్లో అదనపు షెడ్లు ఏర్పాటు చేయాలని మేయర్ గుండు సుధారాణి హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. శనివారం బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న రెండు నర్సరీలను మేయర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు.

బడ్జెట్ అంచనాల్లో ఆలస్యమెందుకు?