మేడారం మహాజాతర బాటపట్టిన భక్తులు | Sakshi
Sakshi News home page

మేడారం మహాజాతర బాటపట్టిన భక్తులు

Published Wed, Feb 21 2024 1:38 AM

-

మేడారం(ఎస్‌ఎస్‌తాడ్వాయి): వన జాతర.. జన జాతరగా మారనుంది. తెలంగాణ కుంభమేళా, ఆదివాసీ, గిరిజన సంస్కృతీసంప్రదాయాల సమ్మేళనం.. మేడారం మహాజాతర నేడు(బుధవారం) ప్రారంభం కానుంది. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో కన్నెపల్లి వెన్నెలమ్మ సారలమ్మ గద్దైపెకి చేరుకుంటుంది. అలాగే కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, తల్లులను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులు మేడారం బాటపట్టారు.

ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం..

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డోలువాయిద్యాలు, నృత్యాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దైపెకి తీసుకురానున్నారు. ఏటూరునాగారం మండలంలోని కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకొస్తారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు డోలువాయిద్యాల మధ్య మంగళవారం మేడారానికి బయలుదేరాడు. అటవీ మార్గంలో 70 కిలోమీటర్ల మేర కాలినడక బయలుదేరి నేటి సాయంత్రానికి మేడారానికి చేరుకుంటాడు. కాగా ముగ్గురు ఒకేసారి గద్దెలపై ఆసీనులవుతారు. జాతర రెండోరోజు గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోవడంతో భక్తుల మొక్కులు జోరందుకుంటాయి. శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఒడిబియ్యం, చీరసారె, పసుపు, కుంకుమ, బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం రాత్రి తల్లులను పూజారులు తిరిగి వన ప్రవేశం చేయిస్తారు.

ఇప్పటికే 50 లక్షల మంది దర్శనం..

మహా జాతరకు ముందే 50 లక్షల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. కాగా, జాతర నాలుగు రోజుల్లో కోటిన్నర నుంచి రెండు కోట్లపైగా భక్తులు తల్లులను దర్శించుకుంటారని అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది.

సన్నద్ధం..

బుధవారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీస్‌ రోప్‌పార్టీని సిద్ధం చేశారు. కన్నెపల్లి నుంచి అమ్మవారిని తీసుకువచ్చే పూజారులను తాకేందుకు భక్తులు ఎదురుచూస్తుంటారు. దీంతో పోలీసులు ముందస్తుగా రోడ్లపై భక్తులు రాకుండా కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు కన్నెపల్లి సారలమ్మ గుడివద్ద పూజారులకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.

నేడు గద్దైపెకి కన్నెపల్లి సారలమ్మ రాకతో జాతర ప్రారంభం

ఆసీనులుకానున్న గోవిందరాజులు,

పగిడిద్దరాజు

రాత్రి గద్దైపెకి చేరిన జంపన్న

సర్వం సిద్ధం చేసిన

అధికార యంత్రాంగం

Advertisement
 
Advertisement