
న్యూశాయంపేట : విదేశాల్లో విద్యనభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం అర్హులైన మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ, పోస్టు డాక్టరోల్ కోర్సులు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుంచి డిసెంబర్ 2023 మధ్య కాలంలో అడ్మిషన్ తీసుకున్న వారు అర్హులని తెలిపారు. వివరాలకు సుబేదారి కలెక్టరేట్ కాంప్లెక్‌లోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
భద్రకాళికి దేవాదాయశాఖ
కమిషనర్ పూజలు
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ దంపతులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఈఓ శేషుభారతి, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కమిషనర్ దంపతులు ముందుగా ఆదిశంకరుడు, వల్లభగణపతిని దర్శించుకున్న అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్లికార్జునరెడ్డి, దేవాదాయశాఖ వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంతారావు, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, కార్యాలయ సూపరింటెండెంట్ వీరస్వామి, ఇన్‌స్పెక్టర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ అక్షరాస్యత పెరగాలి
కేయూ క్యాంపస్ : డిజిటలైజేషన్‌తో మానవ అభివృద్ధి జరగాలని కేయూ వీసీ తాటికొండ రమేష్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యావిభాగం, కాకతీయ యూనివర్సిటీ విద్యావిభాగం సంయుక్తంగా కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో మంగళవారం వర్క్‌షాపు నిర్వహించారు. ది ఇంపాక్ట్ ఆఫ్ డిజిటలైజేషన్ ఆన్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఇన్ తెలంగాణ ఏ క్రిటికల్ సర్వే ఆఫ్ సెలెక్టెడ్ ఏరియాస్ అనే అంశంపై వీసీ రమేష్ మాట్లాడారు. డిజిటలైజేషన్‌లో భారత్ శరవేగంగా ముందుకెళ్తోందన్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగం మన ప్రజ్ఞతో ఆధారపడి ఉంటుందని, ప్రతిఒక్కరూ మార్పును ఆహ్వానించాలని సూచించారు. ఆదివాసీలు, గిరిజన మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత పెరిగినప్పుడే మూఢనమ్మకాలు, అసమతుల్యత తగ్గుదల సాధ్యం వీసీ అభిప్రాయపడ్డారు. కేయూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యావిభాగం అధిపతి జేవీ.మధుసూదన్, ఆ విభాగం ఆచార్య రావుల కృష్ణయ్య, కేయూ విద్యాకళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్.రణధీర్‌రెడ్డి, విద్యావిభాగం డీన్ ఆచార్య రాంనాథ్‌కిషన్, రిటైర్డ్ ఆచార్యులు డి.రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన
అదనపు కలెక్టర్
కరీమాబాద్ : వరంగల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన గట్టు సంధ్యారాణి మంగళవారం కలెక్టర్ పి.ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేయగా.. కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ సంధ్యారాణికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment