మేడారం.. జిగేల్‌ | Sakshi
Sakshi News home page

మేడారం.. జిగేల్‌

Published Tue, Feb 20 2024 1:18 AM

విద్యుత్‌ వెలుగులో వనదేవతల గద్దెలు - Sakshi

హన్మకొండ: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే మేడారం విద్యుత్‌ వెలుగుల్లో కాంతులీనుతోంది. గద్దెల ప్రాంతం మొదలు.. భక్తులు ఆవాసం ఏర్పరుచుకునే ప్రాంతాల వరకు విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. ఫలితంగా మేడారంలో విద్యుత్‌ వెలుగులు జిగేలుమంటున్నాయి. రాత్రి సమయం కూడా పగలు మాదిరి కనిపిస్తోంది. రూ.16,73,23,660 అంచనా వ్యయంతో జాతరలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరిగేలా టీఎస్‌ ఎన్పీడీసీల్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. రెండు సబ్‌ స్టేషన్ల ద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మేడారం కొత్తూరు 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌లో 8 ఎంవీఎ సామర్థ్యం కలిగిన 2 పవర్‌ టాన్స్‌ఫార్మర్లు, సమ్మక్క సబ్‌ స్టేషన్‌ (కొత్త)లో 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన రెండు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు సబ్‌ స్టేషన్లకు అంతరాయం కలుగకుండా రెండు వైపుల నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా జాతరకు ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో విద్యుత్‌ సరఫరాలో వైఫల్యాలకు తావు లేకుండా ఉండేందుకు 208 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఇందులో 315 కేవీఏ సామర్థ్యం కలిగినవి నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు, 160 కేవీఏ సామర్థ్యం కలిగినవి 84, 100 కేవీఏ సామర్థ్యం కలిగినవి 96, 25 కేవీఏ సామర్థ్యం కలిగినవి 24 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 65.8 కిలో మీటర్ల హెచ్‌టీ లైన్‌, ఎల్‌టీ లైన్‌ వేశారు. కాగా, విద్యుత్‌ లైన్లు తెగి భూమిపై పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 7,500 ఫోర్‌ వైర్‌ స్పేషర్స్‌ ఏర్పాటు చేసింది. నాలుగు వైర్లలో ఏ ఒక్కటి తెగినా నేలపై పడుకుండా ఫోర్‌ వైర్‌ స్పేషర్స్‌ అడ్డుకుంటాయి.

మేడారం తరలిన సిబ్బంది..

జాతరలో ఏ మాత్రం అంతరాయం కలిగినా, చిన్న వైఫల్యాలు ఎదురైనా వెంటనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం.. అధికారులు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బందిని మేడారానికి తరలించింది. వీరంత సోమవారం మేడారం చేరుకుని వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరారు. ఈ నెల 25వ తేదీ వరకు మేడారం జాతరలో సేవలు అందిస్తారు. ఇద్దరు సీజీఎంలు వి.మోహన్‌ రావు, కిషన్‌ పర్యవేక్షణలో నలుగురు సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, 10 మంది డివిజన్‌ ఇంజనీర్లు, 120 మంది అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, సబ్‌ ఇంజనీర్లు, 400 మంది ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఉద్యోగులు, మరో 40 మంది కాంట్రాక్ట్‌ కార్మి కులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు వారికి కేటా యించిన ప్రాంతాల్లో లైన్‌ పెట్రోలింగ్‌ చేస్తూ లోపాలను గుర్తిస్తూ సరి చేస్తారు. అందుకు కావాల్సిన మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచుకున్నారు. రాత్రి, పగలు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తూ భక్తులకు విద్యుత్‌ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గద్దెల చుట్ట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

విద్యుత్‌ కాంతుల్లో మెరుస్తున్న వనం

జాతరలో నిరంతరాయంగా విద్యుత్‌

రెండు సబ్‌స్టేషన్ల ద్వారా సరఫరా

208 విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు

విధుల్లో 134 మంది ఇంజనీర్లు, 400 మంది ఆపరేషన్‌ ఉద్యోగులు

విద్యుత్‌ లైన్లు తెగకుండా ముందు జాగ్రత్త చర్యలు

1/1

Advertisement
Advertisement