
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు డీఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ అబ్దుల్‌హై, జిల్లా ఏసీజీ చలపతిరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
అక్టోబర్ 1న చెస్ పోటీలు
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీన హనుమకొండ ములుగురోడ్ సమీపంలోని శరణ్యగార్డెన్ నందు జిల్లాస్థాయి చదరంగ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్నా.. శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–09, 13, 15 బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన నలుగురు బాలికలు, నలుగురు బాలురను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పేరు నమోదుకు 90595 22986 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
26న ఐలమ్మ జయంతి
కాజీపేట అర్బన్: ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు బీసీ వెల్ఫేర్ డీడీ రాంరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు హంటర్‌రోడ్డు న్యూశాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జీఓ 142 రద్దు చేయాలి
రేపు ధర్నా
ఎంజీఎం : వైద్యారోగ్యశాఖలోని జీఓ 142 రద్దు చేయాలని డాక్టర్లు, పారామెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు సోమవారం హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్‌ఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు జీఓ రద్దు స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ జీఓ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4 వేలకు పైగా పోస్టులు రద్దు చేయడానికి అవకాశం ఉందన్నారు. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బానోతు నెహ్రూచంద్ నాయక్, యాదా నాయక్, మాధవరెడ్డి, రవీందర్, మధుసూదన్‌రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీహేరంబగణపతిగా
పూజలు
హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న శ్రీఉత్తిష్ట నవరాత్రి మహోత్సవాలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. మూల మహాగణపతికి గంధవిలేపనాలు అద్ది చతుర్ముఖాలతో శ్రీహేరంబగణపతిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో కంజుల మహేశ్ దాతగా యాగశాలలో గణపతి రుద్రహోమం నిర్వహించారు. అనంతరం పంచలోహ ఉత్సవ మూర్తిని సింహ వాహనంపై ప్రతిష్ఠించి దేవాలయం చుట్టూ ఊరేగించి వాహన సేవ నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు వెంకటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. సత్యమూర్తి సౌజన్యంతో అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈఓ వెంకటయ్య పర్యవేక్షించారు. పరమేశ్వర్ శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి.
ఇద్దరు తహసీల్దార్లకు
స్థానచలనం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మక్బుల్‌ను హనుమకొండ ఆర్డీఓ కార్యాలయం డీఏఓగా, అక్కడ పని చేస్తున్న శైలజను కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా నియమించారు. వీరితోపాటు కమలాపూర్, ఎల్కతుర్తి, హనుమకొండ మండలాల్లోని సీనియర్ అసిస్టెంట్లకు స్థానచలనం కల్పించారు.
