
పోటీలు ప్రారంభిస్తున్న చీఫ్ విప్ వినయ్‌భాస్కర్
హన్మకొండ: ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ఆధునిక వసతులను కల్పించడమే లక్ష్యంగా.. సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రత్యేక క్రీడా పాలసీ అమలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. పాఠశాల క్రీడల సమాఖ్య(ఎస్‌జీఎఫ్) హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి అండర్–17 రెజ్లింగ్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియం వెనుకాల ఉన్న రెజ్లింగ్ హాల్ జరుగుతున్న ఈపోటీలకు ముఖ్య అతిథిగా వినయ్‌భాస్కర్ హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన జ్యోతి ప్రజ్వళన చేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. చారిత్రక ఓరుగల్లు కళలకు, పోరాటాలతో పాటు ప్రతిభ కల్గిన క్రీడాకారులకు నిలయమన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఓరుగల్లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, సకల సౌకర్యాలతో స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఎస్‌జీఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి దస్రూ నాయక్ మాట్లాడుతూ.. ఈపోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 400ల మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లా కేంద్రంలో జరగనున్న జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బాలికల ప్రీస్టైల్ 36 కేజీల నుంచి 73 కేజీల విభాగంలో పోటీలు నిర్వహించగా, బాలురకు గ్రీకో రోమన్ 41 కేజీల నుంచి 110 కేజీల కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నట్లు దస్రూ నాయక్ తెలిపారు. కోచ్‌లకు, క్రీడాకారులకు ఉచిత భోజన, ఇతర సదుపాయాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ జి.అశోక్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, చెన్నం మధు, బీఆర్‌ఎస్ నాయకులు పులి రజనీకాంత్, ఏనుగుల రాంప్రసాద్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, రాజబోయిన భిక్షపతి, పీడీలు సదానందం, బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
జేఎన్‌ఎస్ వేదికగా రాష్ట్ర స్థాయి
రెజ్లింగ్ పోటీలు
మూడ్రోజులపాటు కొనసాగనున్న క్రీడలు