గుంటూరు మెడికల్ 2026 మార్చి నెల ఆర్థిక సంవత్సరాంతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సుమారు రూ.7,358.33 కోట్ల బకాయిలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు ఎన్జీవో హోమ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బకాయిల విడుదలకు చొరవ చూపిన ఏపీ ఎన్జీజివో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరితో స్పందిస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం దశల వారీగా తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించి, చట్టబద్ధత కల్పించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయం ద్వారా హెచ్‌ఓడీలలో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులకు ముగింపు లభించిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా సహ అధ్యక్షుడు సీహెచ్.రాంబాబు, ఉపాధ్యక్షుడు బి.దుర్గారావు, జిల్లా సంయుక్త కార్యదర్శులు జానీబాషా, బి.కృష్ణకిషోర్, కె.నరసింహారావు, కె.విజయ్, గుంటూరు సిటీ కార్యదర్శి సీహెచ్ కళ్యాణ్‌కుమార్, సిటీ ఉపాధ్యక్షుడు సాంబశివరావు, మురళీకృష్ణ, అంకమ్మరావు, శ్రీనివాసరావు పత్తిపాడు అధ్యక్షులు కే శేషగిరి రాజు, అమరావతి కార్యదర్శి షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు.


