బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
మంగళగిరి టౌన్: పార్టీలోనే ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణ పరిధిలోని గౌతమ బుద్ధా రోడ్‌లోని బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభయాన్ 2026 శిక్షణ తరగతులు నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. చివరిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా కృషి చేయాలన్నారు. అంతోద్యయ ద్వారా సమాజంలోని చివరి వ్యక్తికి సేవలు చేరేలా సర్వ వ్యాప్తి, సర్వస్పర్శి లక్ష్యంతో పార్టీ విస్తరణ జరగాలని సూచించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలపై విశ్లేషాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివన్నారాయణ, జిల్లా కార్యదర్శి పంచుమర్తి ప్రసాద్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ్ణంరాజు రాజీనామా చేయాలి
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ డిమాండ్
లక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో దళితుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ, తన అనుచరులతో దళిత యువతను రెచ్చగొట్టి అల్లకల్లోలం సృష్టించిన ఉండి ఎమ్మెల్యే, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వైఖరిని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వ తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని అన్నారు. పెద్దపేటలో అసలు ఏం జరిగిందో, దళిత యువతపై ఏరకంగా దాడులు జరిగాయో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు రఘురామకృష్ణంరాజు చర్యలను సమర్థిస్తూ ప్రకటనలు చేయడం అత్యంత అన్యాయమని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే కనీసం విచారణ చేయకుండా ఏకపక్షంగా మాట్లాడటం రాష్ట్రానికి హానికరం అని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న రఘురామకృష్ణంరాజును పదవి నుండి తొలగించని పక్షంలో దళిత ప్రజాసంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యా ణార్థం, సకల ప్రాణ కోటికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని కోరుతూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి సూర్యనారాయణుడికి కేసరిని నివేదనగా సమర్పించారు. అనంతరం అందరికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ భక్తులకు ప్రసాద పంపిణీ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మ వారి దర్శనానికి అనుమతించారు.


