నేడు ఏఎన్‌యూ పాలకమండలి సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు ఏఎన్‌యూ పాలకమండలి సమావేశం

Mar 30 2026 8:39 AM | Updated on Mar 30 2026 8:39 AM

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో పాలక మండలి సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆమోదింపజేయనున్నారు. ఈ వార్షిక బడ్జెట్‌లో యూనివర్సిటీకి వచ్చే ఆదాయం, ఖర్చులు ప్రభుత్వం విడుదల చేసే బ్లాక్‌ గ్రాండ్‌ నిధులు, ఉద్యోగుల వేతనాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు వంటి ప్రధాన అంశాలకు బడ్జెట్‌ కేటాయింపులు జరుగుతాయని అధికారులు చెప్పారు. సమావేశానికి ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షత వహించనున్నారు.

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు బాజీ మృతి

మేడికొండూరు: మంగళగిరి మండలం చినకాకాని వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మేడికొండూరుకు చెందిన వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ బాజీ మృతి చెందారు. బాజీ కుటుంబ సభ్యులు చిన్నారి మొక్కు తీర్చుకోవడానికి అమలాపురం దర్గాకు వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను అంబులెనన్స్‌లో ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షేక్‌ బాజీ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ మేడికొండూరు మండలం యూత్‌ ప్రెసిడెంట్‌గాను, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గాను, రేషన్‌ షాప్‌ డీలర్ల ప్రెసిడెంట్‌గాను, ఫిరంగిపురం యార్డు చైర్మన్‌గాను పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్నాడు. బాజీ అకాల మరణంతో మండల వాసులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంతో మునిగిపోయారు.

బాజీ మరణం పార్టీకి తీరని లోటు

తాడికొండ: మేడికొండూరు మండలానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ బాజీ మరణం పార్టీకి తీరని లోటని వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు(డైమండ్‌) తెలిపారు. ప్రమాదంలో గాయపడి రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాజీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.

నేడు సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్‌ డే

తాడికొండ: రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘గ్రీవెన్స్‌ డే’ నిర్వహించనున్నట్లు సీఆర్డీయే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వివిధ విభాగాల అధికారులు అర్జీలు స్వీకరించనున్నారు. కావున రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

మిర్చి కమీషన్‌ దుకాణంలో నగదు చోరీ

నగరంపాలెం: మిర్చి కమీషన్‌ దుకాణంలో నగదు చోరీపై బాధితుడు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్గా రోడ్డులో శివరామచౌదరి మిర్చి కమీషన్‌ దుకాణం నిర్వహించేవారు. శుక్రవారం రాత్రి దుకాణం షట్టర్‌కి తాళం వేసి వెళ్లాడు. శనివారం ఉదయం దుకాణం వద్దకు వచ్చేసరికి షట్టర్‌ తాళాలు పగిలిపోయి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే లోనికెళ్లి బీరువా చూడగా, అందులో భద్రపరిచిన రూ.6 లక్షలు కనిపించలేదు. ఎవరైనా గుర్తుతెలియని అగంతకులు నగదు తస్కరించినట్లు గుర్తించి లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుకాణం, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అలాగే సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల పుటేజీ సేకరించారు.

అంతర్జాతీయ కోచింగ్‌ కోర్సుకు శ్రీనివాసరావు ఎంపిక

యడ్లపాడు: మండలంలోని మైదవోలు గ్రామానికి చెందిన వాలీబాల్‌ క్రీడాకారుడు, కోచ్‌ నక్కా శ్రీనివాసరావు చైనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐవీబి లెవల్‌–3 అంతర్జాతీయ కోచింగ్‌ కోర్సుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు వాలీబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తనపేరును అధికారికంగా సిఫార్సు చేసినట్లు ఆదివారం తెలిపారు. చైనా వేదికగా ఈ ఏడాది జూలై 17 నుండి 25 వరకు ఈ అత్యున్నత స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. వాలీబాల్‌ కోచింగ్‌లో అత్యున్నత ప్రమాణంగా భావించే లెవల్‌–3 కోర్సుకు ఇంత చిన్న వయసులోనే ఎంపిక కావడం విశేషం. శ్రీనివాసరావు ఎంపిక పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement