అంజుమన్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం
వైఎస్సార్ సీపీ నేతల స్పష్టీకరణ ఈ నెల 30వ తేదీన గుంటూరు నగరంలో భారీ ర్యాలీ
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : అంజుమన్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 30వ తేదీన తలపెట్టిన భారీ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధ్యక్షతన ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబులు భేటీ అయ్యారు. చినకాకానిలోని 71.57ఎకరాల అంజుమన్ భూములను కబ్జా చేసేందుకు చంద్రబాబు సర్కారు పావులు కదిపిన నేపథ్యంలో వాటిని రక్షించుకునే దిశగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మసీదుల వద్ద నిరసన కార్యక్రమాలు, సంతకాల సేకరణ జరుగుతున్న విషయం విదితమే. దానిలో భాగంగా ఈ నెల 30వ తేదీన చేపట్టిన భారీ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు నగరంపాలెంలోని ఈద్గా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సేకరించిన సంతకాలతో జిల్లా కలెక్టర్‌ను కలిసి, మైనార్టీల మనోభావాలను వెల్లడిస్తారు. ఈ సందర్భంగా జిల్లా నలమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ విభాగం నేతలు, ముస్లింలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, అనుబంధ విభాగాల నేతలు కీసరి సుబ్బలు, షరీఫుద్దీన్, లియాఖత్, సుభాని, షేక్ రబ్బాని పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.


