డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.42 లక్షలు స్వాహా | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.42 లక్షలు స్వాహా

Dec 20 2025 7:14 AM | Updated on Dec 20 2025 7:14 AM

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.42 లక్షలు స్వాహా

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.42 లక్షలు స్వాహా

నగరంపాలెం: డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ను మోసగించిన ఐదుగురిని కాకుమాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయం(డీపీఓ) ఆవరణలోని హాల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. కాకుమాను పీఎస్‌ పరిధిలోని కొమ్మూరుకు చెందిన మోపర్తి మేరీ మంజులవాణి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్డు కాగా వచ్చిన నగదు, నెలనెలా పెన్షన్‌ డబ్బులను ఆమె బ్యాంక్‌ ఖాతాలో దాచుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 23న గుర్తుతెలియని ఓ ఫోన్‌ నంబర్‌ నుంచి కాల్‌ చేసి ముంబాయి సీఐడీ అధికారులమని నమ్మించినట్లు చెప్పారు. మానవ అక్రమ రవాణా కేసులో ఒకర్ని అరెస్ట్‌ చేశామని, అందులో మీ పేరు ఉందని చెప్పి బెదిరించినట్లు పేర్కొన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌లో ఉన్నారని, డిజిటల్‌ అరెస్ట్‌ లేకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో నగదు చెల్లించాలని ఐదు రోజులు ఆమెను తీవ్ర ఒత్తిడికి గురిచేయగా ఆమె బెదిరిపోయి బ్యాంక్‌ ఖాతా నుంచి రెండు సార్లుగా రూ.42 లక్షలను రెండు ఖాతాలకు బదిలీ చేసినట్లు చెప్పారు. గత నెల ఏడో తేదీన ఆమె కాకుమాను పీఎస్‌లో ఫిర్యాదు చేశాయగా ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను పీఎస్‌ ఎస్‌ఐ ఏకనాథ్‌ దర్యాప్తు చేపట్టారు.

రెండు బ్యాంక్‌ ఖాతాల్లో జమ..

రెండు బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయిన రూ.42 లక్షల్లో రూ.22 లక్షలు గతనెల ఒకటిన విశాఖపట్నంలోని ఇంద్రప్రస్థ హాస్పిటల్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ మరపు సురేష్‌నాయుడు ఖాతాకి జమ అయినట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు మరపు సురేష్‌నాయుడ్ని విచారించగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. అక్రమంగా డబ్బు సంపాదించాలని ఇంటర్నెట్‌ ద్వారా కార్పొరేట్‌ అకౌంట్లను మ్యూల్‌ అకౌంట్లుగా ఉపయోగించి కమీషన్‌ తీసుకునేలా వ్యవహరించినట్లు గుర్తించినట్లు చెప్పారు. దీంతో హిందూపురం వాసి లక్ష్మణ్‌, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి మోహన్‌ ద్వారా కాకినాడకు చెందిన సింహదాడి సాయిశ్రీనివాస్‌, కారే స్టీవెన్‌న్‌లను పరిచయం చేసుకున్నారని అన్నారు. వీరి ద్వారా ఆగ్రాకు చెందిన మోహిత్‌ శిఖర్వార్‌(టేకి) అనే వ్యక్తితో మాట్లాడి, ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం ఇండోర్‌, జైపూర్‌ వెళ్లి, కార్పొరేట్‌ అకౌంట్‌కు డిజిటల్‌ అరెస్ట్‌ ద్వారా వచ్చిన నగదును వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారని చెప్పారు. దీంతో సురేష్‌నాయుడు, పార్వతీపురం జిల్లాకు చెందిన సింహదాడి సాయిశ్రీనివాస్‌, ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాకు చెందిన మోహిత్‌ శిఖర్వార్‌, అనకాపల్లి జిల్లాకు చెందిన కారే స్టీవెన్‌, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు చెందిన పొదల మోహన్‌ అరెస్ట్‌ చేశారని వివరించారు. వారి నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు, రూ.50 వేలు, ఇంద్రప్రస్థ కార్పొరేట్‌ అకౌంట్‌ కిట్‌ను సీజ్‌ చేసుకున్నట్లు వెల్లడించారు. కంబోడియా దేశానికి చెందిన ఫోన్‌ నంబర్లుగా గుర్తించామని అన్నారు. అక్కడ్నుంచి ఇటువంటి సైబర్‌ నేరాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. కేసులో మిగతా వారిని అరెస్ట్‌ చేస్తామని అన్నారు. దక్షిణ డీఎస్పీ భానోదయ, ప్రత్తిపాడు పీఎస్‌ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్‌ సీఐ నిస్సార్‌బాషా, కాకుమాను పీఎస్‌ ఎస్‌ఐ ఏకనాథ్‌, హెచ్‌సీలు జె.జె.నరసింహారావు, కె.చిరంజీవి, రాజాకిశోర్‌, కానిస్టేబుళ్లు ఎం.అశోక్‌, జి.ఖజాకరీమా, రాము, ఎస్‌కె.ఇమామ్‌, యాసిన్‌, ఉపేంద్రసాయిని అభినందించి, ప్రశంసపత్రాలను అందించారు.

ఉపాధ్యాయుల్లో సాంకేతిక నైపుణ్యాలు బలోపేతం

ప్రత్తిపాడు: ఉపాధ్యాయుల్లో సాంకేతిక నైపుణ్యాలను మరింత బలోపేతం చేసేందుకు బూట్‌ క్యాంప్‌ దోహదపడుతుందని గుంటూరు జిల్లా డీఈవో షేక్‌ సలీం అన్నారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ఎఐసీటీఈ, ఎంవోఈ ఇన్నోవేషన్‌ సెల్‌, ఎస్‌సీఈఆర్టీ, స్కూల్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌, వాద్వానీ ఫౌండేషన్‌ సంయుక్త నిర్వహణలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఇన్నోవేషన్‌, డిజైన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్షిప్‌ (ఐడీఈ) పై మూడు రోజుల పాటు నిర్వహించిన బూట్‌ క్యాంప్‌ శుక్రవారంతో ముగిసింది.

● ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీం బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ ప్రారంభించిన ఈ బూట్‌ క్యాంప్‌ ఎంతో విలువైనదన్నారు. సాంకేతికంగా రోజురోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు తమను తాము మెరుగు పరుచుని సాంకేతికంగా ధృఢం అయ్యేందుకు క్యాంప్‌ ఉపకరిస్తుందన్నారు.

● కిట్స్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కోయి సుబ్బారావు మాట్లాడుతూ క్యాంపస్‌లో అవిఘ్నంగా బూట్‌ క్యాంప్‌ జరిగిందన్నారు. తమ కళాశాలను నోడల్‌ సెంటర్‌గా ఎంపిక చేసిన ఏఐసీటీఈ, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

● కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో నవీనత, డిజైన్‌ థింకింగ్‌, పారిశ్రామిక నైపుణ్యాలను పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్‌ సెల్‌తో కలిసి జాతీయ స్థాయిలో ఐడిఇ బూట్‌ క్యాంప్‌ను నిర్వహించిందన్నారు.

కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కె. శేఖర్‌, డైరెక్టర్‌ కె. హరిబాబు, అరుణ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విశ్రాంత హెచ్‌ఎంను మోసగించిన

ఐదుగురు అరెస్ట్‌

మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement