రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ‘ఆదర్శ్ 2025 – స్పోర్ట్స్ ఫర్ హార్మనీ‘ పేరుతో రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పావురాలను ఎగురవేశారు. రవినాయుడు మాట్లాడుతూ చదువు ఒక్కటే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత టెక్నాలజీ యుగంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి 15 క్రీడా అంశాలపై స్పోర్ట్స్‌మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా క్రీడల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న కళాశాలగా హిందూ కళాశాల పేరు పొందిందని తెలిపారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ పీఎం ప్రసాద్ , జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్ ఖాన్, ఏపీ శాప్ సభ్యుడు ఎస్.సంతోష్ కుమార్, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఎస్వీఎస్.సోమయాజి, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ వజ్రాల నర్సిరెడ్డి, కొల్లా సుస్మితా చౌదరి, ఫిజికల్ డైరెక్టర్ కె.రవి పాల్గొన్నారు


