మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద, రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నామని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసినప్పుడే పాలన విజయవంతమవుతుందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి ‘సూపర్ సిక్స్‘ హామీలను పక్కన పెట్టి ‘సూపర్ సక్సెస్’ అని చెప్పుకోవడం ఆత్మ సంతృప్తికి తగదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఉపాధి భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం, ఆ హామీ అమలులో ఎందుకు వెనుకంజ వేస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. అనంతరం జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగరకార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు పాల్గొన్నారు.
నేడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మెడికల్ కళాశాలల వద్ద ధర్నాలు
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు


