ఇంధన పొదుపు అందరి బాధ్యత
గుంటూరు వెస్ట్: ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన వనరుల పొదుపు పాటించటం వల్ల భవిష్యత్ తరాలకు ఇంధన భద్రత, భరోసా కల్పించటం సాధ్యం అవుతుందన్నారు. జాతీయ ఇంధన వనరుల వారోత్సవాలు ప్రతి ఏటా డిసెంబరు 14వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. వారోత్సవాలలో విద్యుత్ వంటి ఇంధన వనరులను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించటంపై ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు, యువతకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. సోలార్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇంధన పరిరక్షణ , పొదుపు చిట్కాల ప్రచార పోస్టర్లును ఆవిష్కరించి, ఇంధన వనరులను పొదుపు పాటిస్తామని, వృథాను అరికడతామని ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీడీసీఎల్ ఎస్‌ఈ చల్లా రమేష్, సీఆర్‌డీఏ సర్కిల్ ఎస్‌ఈ ఎం. శ్రీనివాసరావు, ఈఈ కె.సత్యనారాయణ, డీఈలు శ్రీనివాసబాబు, నాగేశ్వరరావు, జె.హరిబాబు, సూర్యప్రకాష్, ఎస్‌ఏఓ రామిరెడ్డి, ఏడీఈలు బి.రాజమోహనరావు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


