రాజకీయ సభల్లా పేరెంట్, టీచర్స్ మీటింగ్స్
ప్రేక్షక పాత్రకు పరిమితమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చంద్రబాబు సర్కార్ భజన మినహా ఒనగూరిన ప్రయోజనం శూన్యం విద్యార్థులతో అబద్ధాలు చెప్పించిన అధికారులు విద్యారంగం, విద్యార్థుల ప్రగతి చర్చించకుండానే ముగింపు ఎందుకు ఆహ్వానించారో అర్థంకాక అయోమయంలో తల్లిదండ్రులు
వేదికలపై ప్రజాప్రతినిధులతోపాటు టీడీపీ నాయకుల హడావుడి
చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్(పీటీఎం)లు రాజకీయ సభలుగా మారాయి. ప్రజాప్రతినిధులతోపాటు టీడీపీ నాయకులు వేదికలు ఎక్కి హల్‌చల్ చేశారు. విద్యారంగం, విద్యార్థుల ప్రగతి గురించి చర్చించకుండా చంద్రబాబు, లోకేష్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో తమను ఎందుకు ఆహ్వానించారో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. చివరకు రాజకీయ ఉపన్యాసాలు చెప్పి మమ అనిపించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని ఎస్‌కేబీఎం నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పీటీఎం 3.0 మధ్యాహ్నం 11.30 గంటల వరకు ప్రారంభం కాలేదు. గుంటూరు నగరంలోనే అత్యధిక సంఖ్యలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో పీటీఎం పేరుతో తల్లిదండ్రులను ఆహ్వానించిన ఉపాధ్యాయులు, అధికారులు తరగతి గదుల్లో సమావేశాన్ని నిర్వహించడం బదులు పాఠశాల ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసి బహిరంగ సభ లా నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించిన తల్లిదండ్రులు ఎమ్మెల్యే గళ్లా మాధవి వచ్చే వరకు వేచి ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు టీడీపీ నాయకులతో నిండిపోయిన సభావేదికపై విద్యార్థుల ప్రగతి, పాఠశాలలో మౌలిక వసతులు, తల్లిదండ్రులతో విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ ప్రగతిపై చర్చించడం బదులు సీఎం చంద్రబాబు, విద్యా శా ఖ మంత్రి లోకేష్‌పై పొగడ్తలు, ప్రశంసలతో సమావేశం ఆద్యంతం కొనసాగింది. దీంతో పీటీఎంకు హాజరైన తల్లిదండ్రులు తెల్లమొఖాలు వేశారు. అసలు తమను ఆహ్వానించిన ఉద్దేశమేమిటో, అక్కడ జరుగుతున్నదేమిటో అర్థంకాక అయోమ యానికి గురయ్యారు. పీటీఎంలో తరగతుల వా రీ గా పరస్పరం సమావేశమై చర్చించాల్సిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బహిరంగ సభలా నిర్వహించిన పీటీఎంలో ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు.
చంద్రబాబు సర్కార్ భజన
చంద్రబాబు సర్కారు భజన మినహా సమావేశాల్లో మరో విషయం ప్రస్తావనకు రాలేదు. చంద్రబాబు సర్కారు వచ్చిన తరువాతే ప్రభుత్వ పాఠశాలలు ఆధునికీకరణకు నోచుకున్నాయని, తల్లికి వందనం రాకముందు తాము గతంలో ఎన్నడూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుకోలేదన్నట్లుగా విద్యార్థులతో వేదికపై అబద్ధాలు పలికించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు ప్రతి విద్యార్థి తల్లికి జగనన్న అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా అధికారులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా పాఠశాలల ఆధునికీకరణ, వసతులు కల్పించిన విషయమై ఎక్కడా ప్రస్తావన లేకుండా చేశారు. బహిరంగ సభలా పీటీఎం జ రుగుతుండగా, విద్యార్థులు పాఠశాల మైదానంలో ఆటల్లో మునిగితేలారు. పీటీఎంకు హాజరైన తల్లిదండ్రులు చెట్ల కింద కూర్చుని ప్రసంగాలు వినేందుకు పరిమితమయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పీటీఎంలో ఎమ్మెల్యే గళ్లా మాధవితోపాటు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, స్థానిక టీడీపీ నాయకులు, టీడీపీ మాజీ కార్పొరేటర్లు వేదికపై పాల్గొని, మాట్లాడారు. వైసీపీకి చెందిన స్థానిక కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని కార్యక్రమానికి ఆహ్వానించలేదు. అదే విధంగా తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్, తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఈ విధంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ నాయకులు వేదికలు ఎక్కారు. మెగా పీటీఎం 3.0 పేరుతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన సమావేశాలు ఈ విధంగా రాజకీ సభలుగా మారిపోమి, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయాయి.


