8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2025 కార్యక్రమానికి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిలువనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు పేర్కొన్నారు. గుంటూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రోచర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు నోడల్ సెంటర్లలో కిట్స్ కళాశాల ఒకటిగా ఉందని వివరించారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా కిట్స్ కళాశాలకు 21 రాష్ట్రాల నుంచి విద్యార్థి బృందాలు రానున్నాయని చెప్పారు. 8వ తేదీ ఉదయం 8 నుంచి 9వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు నిర్విరామంగా హ్యాకథాన్ జరగనుందన్నారు. అత్యుత్తమమైన ఒక్కో గ్రూప్‌నకు రూ.1.50 లక్షల నగదు బహుమతిని కేంద్రం అందజేస్తుందని చెప్పారు. సమావేశంలో కిట్స్ కళాశాల కార్యదర్శి కోయి శేఖర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. బాబు, హ్యాకథాన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ అరుణ పాల్గొన్నారు.


