గుంటూరు వైద్య కళాశాలలో ఫార్మకాలజీ జాతీయ సదస్సు
పర్యావరణహితంగా పరిశోధనలు జరగాలి
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీ ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాలలో జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఫార్మాకాలజీ జాతీయ సదస్సు జరగనుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరచారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సంయుక్తంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఫార్మకాలజీ సొసైటీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మీనా కుమారి పాల్గొన్నారు. నెక్ట్స్‌జెన్ ఫార్మా అనే థీమ్‌తో రెండు రోజులపాటు జరగనున్న ఈ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి ఫార్మకాలజీ ప్రొఫెసర్లు, అసోసియేట్ – అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కాలేజీ వేదికగా జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వక్తలు పర్యావరణానికి అనుకూలంగా జరిగే ఫార్మకాలజీ ట్రయల్స్‌ను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. దీర్ఘకాలిక రోగాలకై కొత్త ఔషధాల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో మరిన్ని పరిశోధనలు జరగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సమావేశానికి ఫార్మకాలజీ విభాగాధిపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సాల్మాన్‌రాజు, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో పాటు వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్ (అకాడెమిక్) డాక్టర్ మాధవి పాల్గొని పరిశోధన ఉపన్యాసాలు అందించారు.


