నేలకొరిగిన 120 ఏళ్ల రావిచెట్టు
తాడేపల్లి రూరల్: కృష్ణానది ఎగువ ప్రాంతంలోని అమరావతి కరకట్ట వెంబడి 120 సంవత్సరాల రావిచెట్టు బుధవారం మోంథా తుపాను ప్రభావంతో వీచిన గాలికి నేలకొరిగింది. బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున గేట్లు బెండింగ్ చేసే షెడ్డు వద్ద ఈ రావిచెట్లు గతంలో ఎన్నో తుపానులను తట్టుకుని నిలబడింది. ఈ మధ్యకాలంలో చెట్టు కింద భాగంలో వేళ్లు కుళ్లిపోవడంతో మోంథా ధాటికి నేలకొరిగినట్లు మత్స్యకారులు తెలియజేశారు. అమరావతి కట్ట వెంబడి ప్రయాణించేవారు, స్థానికులు ఈ చెట్టు కింద సేద తీరేవారని పేర్కొన్నారు.
తుపాను వేళ ‘డ్రోన్’ పహారా
నగరంపాలెం: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యల నిమిత్తం డ్రోన్ కెమెరాలతో పహారా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించామని అన్నారు. గండ్లు పడే అవకాశాలు ఉన్నచోట ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కట్టలను మరింత బలోపేతం చేశామన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుదల, ప్రమాద సూచనలపై తక్షణమే చర్యలు చేపట్టారని తెలిపారు. గుంటూరు నగరం, శివారుల్లోని కాలనీల వాసులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
నేటి నుంచి యఽథావిధిగా పాఠశాలలు
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలో పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక చెప్పారు. బుధవారం ఆమె జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు, హెచ్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలను పునఃప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలు, శిథిలావస్థకు చేరిన భవనాలు ఉంటే భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆవరణలో గుంతలు ఏర్పడితే పూడ్చివేయాలని, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తుపాను ప్రభావంతో మహిళ మృతి
పెదకాకాని: తుపాను ప్రభావంతో మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం తక్కెళ్ళపాడు గ్రామంలో వెలుగు చూసింది. కౌండ్రగుంట సీతమ్మ (49) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో యథావిధిగా నిద్రపోయింది. ఉదయం చూసేసరికి మృతి చెందింది. గత రాత్రి విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు మాత్రం గుండెపోటుతో మరణించి ఉంటుందనే సందేహం వ్యక్తం చేశారు. పెదకాకాని తహసీల్దార్ పి.కృష్ణకాంత్ ఆ కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సహాయం అందజేశారు.
తాత్కాలికంగా
రెండు రైళ్లు రద్దు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్లను గురువారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు డివిజన్ పీఆర్‌ఓ వినయ్‌కాంత్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు–వికారాబాద్ (12747), విజయవాడ–సికింద్రాబాద్ (12713) రైళ్లు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించి సహకరిచాలని కోరారు.
పత్తి కొనుగోలుకు 30 కేంద్రాలు
కొరిటెపాడు: ప్రస్తుత సీజన్ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 30 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు బ్రాంచి మేనేజర్ బుధవారం తెలిపారు. తేమ 8 శాతం మించకపోతే పూర్తి కనీస మద్దతు ధర అందిస్తామన్నారు. తేమ శాతం 8–12 వరకు ఉంటే ధర తగ్గించి చెల్లిస్తామన్నారు. ఆరబెట్టిన పత్తి మాత్రమే కేంద్రాలకు తేవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 76599 54529 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
నేలకొరిగిన 120 ఏళ్ల రావిచెట్టు
నేలకొరిగిన 120 ఏళ్ల రావిచెట్టు


