వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
ప్రత్తిపాడు: మోంథా తుపాను ప్రభావంతో జలమయమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించిన కలెక్టర్ గుంటూరు – పర్చూరు పాత మద్రాసు రోడ్డులో బొర్రావారిపాలెం వద్ద కొండవీడు లోయ వాగు వద్ద నీటి ఉధృతిని పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. ఆహార నాణ్యత వసతులపై ఆరా తీశారు. తదనంతరం పత్తి పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎంత పెట్టుబడులు పెట్టారు, ఎన్ని ఎకరాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడు పునరావాస కేంద్రంలో కలెక్టర్‌కు ఎస్టీ కాలనీ వాసులు తమ గోడును వెల్లబోసుకున్నారు. కాలనీలో కాలువలు పూడిక తీయడం లేదని, మమ్మల్ని పట్టించుకోవడం లేదని తెలిపారు.
ట్రాక్టర్‌పై నక్కల వాగు,
మేకల వాగును దాటుకుంటూ..
వరద ఉధృతితో పెదనందిపాడు మండలం అబ్బినేని గుంటపాలెం సమీపంలో మేకల వాగు, నక్కల వాగులు ఉధృతరూపం దాల్చి, వరద నీరు రోడ్డుపై పెద్ద ఎత్తున ప్రవహించింది. ఆ నీటి ఉధృతిలో కార్లు వెళ్లడం సాధ్యమవ్వకపోవడంతో కలెక్టర్ ట్రాక్టర్ ఎక్కి మేకల వాగు, నక్కల వాగులను దాటుకుంటూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ నల్లమడ వాగు వద్దకు చేరుకుని ఉధృతిని పరిశీలించారు.
కొల్లిమర్లవాగు లాకులు పరిశీలన..
కాకుమాను మండలంలోని కొల్లిమర్ల గ్రామం వద్ద కొల్లిమర్లత వాగు లాకులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈవాగులో చుట్టుపక్కల ఉన్న అనేక వాగులు కలుస్తాయని, వాగులో పూడికలు ఎక్కువగా ఉండటం వలన ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని స్థానిక రైతులు కలెక్టర్‌కు తెలిపారు. పాత బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం సక్రమంగా ఉండటం లేదని, కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయడం వలన ప్రవాహానికి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాకుమానులోని వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఉన్న యూరియా, నానో యూరియా నిల్వలను కలెక్టర్ పరిశీలించారు.
పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు..
ఆయా ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఎదుట రైతులు తమ ఆవేదనను వెల్లబోసుకున్నారు. పత్తి పంటకు ఎకరాకు సుమారు యాభై, అరవై వేలు పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుతం పూత, కాయ దశలో ఉన్న పంట ఈదురుగాలుల ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్నదని వాపోయారు. పంటను కాపాడుకోవాలంటే యూరియా అవసరమని, సరిపడినంత యూరియా అందుబాటులో ఉండేలా చూడాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. వెంట వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వరరావు ఉన్నారు. అదేవిధంగా ఆర్‌అండ్‌బి రహదారికి ఆనుకుని ఉన్న కాలువల్లో సంవత్సరాల తరబడి పూడికలు తీయకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుందని, నక్కలవాగు, మేకలవాగు పూడిక లోతుగా తీయాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.
రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలు..
ప్రభుత్వ నిబంధనల మేరకు రెండు రోజుల్లో పంట నష్ట అంచనాలు తయారు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేశామని, పారిశుధ్యం లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ జరుగుతోందని, రహదారులపై పడిపోయిన 84 చెట్లును క్షణం తొలగించే ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు. జిల్లాలో 153 పునరావాస కేంద్రాలలో తొమ్మిది వేల మంది ఉన్నారని, సీఎం ఆదేశాల మేరకు వారికి నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే ఒక కుటుంబం నుండి ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పటికీ గరిష్ఠంగా మూడు వేలు మాత్రమే చెల్లించనున్నామని చెప్పారు. కలెక్టర్ వెంట రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు,, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వరరావు, ఉద్యానశాఖ ఉపసంచాలకులు రవీంద్ర బాబు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
పొంగిన వాగులు, పత్తి పంట పొలాలు పరిశీలన
పునరావాస కేంద్రాల్లో వసతులపై ఆరా
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన


