అవినీతికి ‘పునరావాసం’?
నెహ్రూనగర్: మోంథా తుపాను పేరుతో నగరపాలక సంస్థ అధికారుల జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ఏకంగా కార్యాలయంలోని సిబ్బందే చెప్పుకోవడం గమనార్హం. తుపాను ప్రభావం జిల్లాపై, గుంటూరు నగరంపై పడుతుందనే ఉన్నతాధికారుల ముందస్తు చర్యల్లో భాగంగా గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు అడ్వాన్స్‌లు ఆదివారమే సిబ్బందికి అందించారు.
లెక్కల్లో ఇలా...
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 57 వార్డుల్లో ప్రభావిత ప్రాంతాలకు దగ్గరలోని మున్సిపల్ స్కూళ్లు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో తూర్పులో 31, పశ్చిమలో 30, ప్రత్తిపాడులో 13 వంతున 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడు నియోజకవర్గాలకు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లను పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరి కింద నియోజకవర్గ సెక్షన్ హెడ్స్, జోనల్ లెవల్ ఫీల్డ్ ఆఫీసర్లు, వార్డు లెవల్ ఆఫీసర్లను నియమించారు. తూర్పులో 3,116 కుటుంబాల్లో 9,946 మంది తుపాన్ కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అందులో 426 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పశ్చిమ నియోజకవర్గంలో 1,017 కుటుంబాల్లో ఉన్న 3,385 మంది ఎఫెక్ట్ అవుతారని చెప్పారు. వీరిలో 871 మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. అదే విధంగా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో 706 కుటుంబాల్లో ఉన్న 1,904 మంది బాధితులని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 587 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా నగరపాలక సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
అడ్డగోలుగా బిల్లులు
మోంథా తుపాను కారణంగా నగర వాసులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతోపాటు కార్పొరేషన్ జనరల్ నిధుల నుంచి నగదు డ్రా చేసి అధికారులకు అందజేశారు. తూర్పు నియోజకవర్గానికి రూ.35 లక్షలు, పశ్చిమ నియోజకవర్గానికి రూ.25 లక్షలు, ప్రత్తిపాడు నియోజకవర్గానికి రూ.15 లక్షల చొప్పులు మొత్తం రూ.75 లక్షలు డ్రా చేసి అధికారులకు, సిబ్బంది అడ్వాన్స్ కింద అందజేశారు. వీటితో పునరావాస కేంద్రాలకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు, ఆహారం, ఇతర వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇదే అదనుగా అధికారులు కొంత మంది కూటమి శ్రేణులతో కుమ్మక్కయ్యారు. వర్ష ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ పలువుర్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇద్దరు వస్తే ముగ్గురు వచ్చినట్లు రాసుకున్నారని కార్యాలయ సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఓ తృతీయ శ్రేణి అధికారి ఒక అడుగు ముందుకేసి ఒక పనికి రెండేసి, మూడేసి బిల్లులు పెట్టండి అంటూ చెప్పడంతో సిబ్బంది ఇదే అదునుగా పెట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు బిల్లులను పరిశీలించి నకిలీ బిల్లులను అరికట్టి ప్రజాధనాన్ని కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు.
బాధితులపై సిబ్బంది ఆగ్రహం
తుపాను నగర్‌లో వర్షాల కారణంగా ఇళ్లన్నీ మునిగి పోవడంతో స్థానికులను స్థంభాలగరువులోని హై స్కూల్‌కు తరలించి, వసతి ఏర్పాటు చేశారు. అక్కడ 150 మందికి వసతి కల్పించినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చాలా మంది పునరావాస కేంద్రానికి వస్తే ‘మీకు ఇల్లులు ఉన్నాయి కదా. మీరెందుకు వస్తున్నారు..’ అంటూ సిబ్బంది కొందరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారంతా ఇల్లు మునిగిపోవడంతోనే ఇక్కడకు వచ్చామని చెప్పారు. సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
గుంటూరు నగరంలో 74 కేంద్రాలు ఏర్పాటు
తుపాను ప్రభావం లేకున్నా
జనం తరలింపు
భోజనాలు పెట్టేందుకు అడ్వాన్స్
తీసుకున్న అధికారులు
ఇదే అదనుగా రెండు, మూడు బిల్లులు పెడుతున్న సిబ్బంది


