రైతులకు అందుబాటులో ఉండండి
మాచర్ల రూరల్: మొంథా తుఫాను పై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పత్తి, మిర్చి, వరి పంటలు పండించే రైతులకు అందుబాటులో ఉండి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు ఆదేశించారు. సోమవారం పట్టణంలోని వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో నిర్వహించిన వ్యవసాయాధికారులతో ఆయన మాట్లాడారు. రైతులందరూ తుఫాను పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమయంలో పంట కోతలు నిర్వహించవద్దని, తుఫాన్ ప్రభావాన్ని బట్టి పంట చేలో కాలువలు తీసి నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పత్తి పంట నీటిలో బాగా తడిస్తే మల్టీ కె (13–0–45) ఎకరాకు కిలో చొప్పున పిచికారీ చేసుకోవాలని, ఆకులు యర్రబడినా, మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేసుకోవాలని కోరారు. మొంథా తుఫాను నేపథ్యంలో వ్యవసాయ శాఖాధికారులందరూ అందుబాటులో ఉండి అన్నీ గ్రామాల రైతులకు సూచనలు అందించాలని కోరారు. సమావేశంలో ఏడీఏ వి.జగదీష్‌రెడ్డి, ఏఓలు డి.పాపకుమారి, కె.లక్ష్మారెడ్డి, వై.అమీర్ రెడ్డి, బాలాజి గంగాధర్, టి.నరసింహారావు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు


