పునరావాస కేంద్రానికి తరలింపు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీ కృష్ణదేవరాయనగర్, తుఫాన్‌నగర్ ప్రాంతంలో వర్షం నీరు చేరింది. ఓ ఇంటి గోడ పడిపోయే స్థితిలో ఉన్న విషయాన్ని గ్రహించి తక్షణమే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఐ.రామాంజనేయులు సిబ్బందితో సోమవారం రాత్రి సహాయక చర్యలు చేపట్టారు. మోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ ఆదేశాల మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం శ్రీకృష్ణదేవరాయనగర్, తుఫాన్‌నగర్ ప్రాంతంలో నిఘా ఉంచారు. ఆ ప్రాంతంలో నివాసం ఉండే సయ్యావు ఖల్‌నాయక్ దివ్యాంగుడు తన రేకుల ఇల్లు గోడ కూలిపోయే స్థితిలో ఉంది. అతడి కుటుంబంతో పాటు చుట్టుపక్కల నీరు చేరిన నివాస గృహాల నుంచి సుమారు 20 మందిని స్తంభాలగరువు మెయిన్ రోడ్‌లోని శ్రీమతి మహాలక్ష్మమ్మ పుల్లయ్య మునిసిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు.


