అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ● తుపాను పరిస్థితులపై సమీక్ష
గుంటూరు వెస్ట్: మోంథా తుపాను దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రాంతీయ ప్రత్యేక అధికారి ఆర్.పి.సిసోడియా అన్నారు. జిల్లా పరిస్థితులపై సమీక్షించేందుకు ఆదివారం గుంటూరు విచ్చేసిన ఆయన కంట్రోల్ రూమ్ కార్యకలాపాలను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎంసీ కమీషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిసోడియా మాట్లాడుతూ తీవ్ర తుపానుగా పరిణామం చెందుతున్న తరుణంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆహార నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవరు ఉండవద్దని సూచించారు. చెట్లు కూలితే తక్షణం తొలగించేందుకు విద్యుత్ రంపాలు (పవర్ సాస్) సిద్ధంగా ఉంచాలని సూచించారు. గండి పడేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి వెంటనే గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న కాజ్‌వేలు వద్ద రెవెన్యూ, పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగు నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయం కలిగితే తాగునీటిని పంపింగ్ చేసేందుకు జనరేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు కూలిపోయిన వెంటనే పునరుద్ధరణ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు మొబైల్ ఫోన్‌లలో అందుబాటులో ఉండాలని అన్నారు.
అవసరమైతేనే బయటకు రండి
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఈ మూడు రోజులు అవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు సూచించారు. మూడు రోజులకు అవసరమైన ఆహార సామగ్రిని ఇళ్లలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నందున టార్చ్ లైట్స్, క్యాండిల్స్ సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా డివిజన్, మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. గర్భిణులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ముందుగానే వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 12 లోతట్టు ప్రాంతాలను గుర్తించామని వారికి అవసరమైతే తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో పీకల వాగు వలన ఇబ్బందులు లేకుండా తగిన మోటార్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు.


