ప్రభుత్వ విద్యలో సమగ్ర మార్పులు అవసరం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యలో సమగ్ర మార్పులు అవసరమని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.రాజశేఖరరావు అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాజశేఖరరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఎంత సేపూ ఉపాధ్యాయులనే బాధ్యులను చేస్తూ మార్పులు ఎన్ని తెచ్చినా అది సంపూర్ణ విద్యా సాధనకు దోహదపడదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య బాగుండాలంటే ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టి బాధ్యత వహించాలన్నారు. దీనిని వదిలేసి కేవలం ఉపాధ్యాయులపై భారం మోపడం, నిందించడం ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పతనానికి దిగదార్చుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ మాట్లాడుతూ పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలు, క్లోజర్లు జాప్యం లేకుండా తక్షణమే చెల్లించాలన్నారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శి సిహెచ్.ఆదినారాయణ, కె.సాంబశివరావు, టి.ఆంజనేయులు, ఎండీ షకీలా బేగం, ఎం.గోవిందయ్య, కేదార్నాథ్, కె.కామాక్షి, కె.రంగారావు, బి.ప్రసాద్, ఆడిట్ కమిటీ కన్వీనర్ అడవి శ్రీనివాసరావు, సభ్యుడు కె.ప్రేమ్ కుమార్, ఎం.కోటిరెడ్డి జి.జితేంద్ర పాల్గొన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
యు.రాజశేఖరరావు


