
గుంటూరులో హత్య.. గుండ్లకమ్మలో శవం!
మద్దిపాడు/లక్ష్మీపురం: గుంటూరులో హత్యకు గురైన వ్యక్తి ప్రకాశం జిల్లా మద్దిపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో శవమై తేలాడు. అందిన సమాచారం ప్రకారం.. వేముల రామాంజనేయులు(45) కనిపించకపోవడంతో భార్య గుంటూరులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుంటూరు పోలీసులు బండారు కొండయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. రామాంజనేయులును హత్య చేసి మద్దిపాడు మండలం వెల్లంపల్లి సమీపంలోని గుండ్లకమ్మ నది పక్కన పూడ్చి వేసినట్లు అంగీకరించాడు. గుంటూరు పోలీసులు సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు తరలించారు. గుంటూరు పోలీసులకు మద్దిపాడు ఎస్‌ఐ సైదులు సహకారం అందించారు.