
యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా
మహిళ దుర్మరణం
హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డులో యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షు శుక్రవారం యాసిడ్ లోడుతో ఏలూరు బయలుదేరాడు. తోడుగా ఉంటుందని తన భార్య షేక్ షంషాద్ (47)ను వెంట తీసుకెళ్లాడు. హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డు వద్దకు రాగానే ట్రక్కు ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో డ్రైవర్ క్యాబిన్‌లో ఉన్న షంషాద్ రోడ్డుపైకి పడిపోయింది. ట్రక్కులో ఉన్న యాసిడ్ డ్రమ్ములు కిందకు ఒరిగి షంషాద్‌పై యాసిడ్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. అలాభక్షు కంటిలో యాసిడ్ పడటంతో పాటుగా శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. రహదారిపై యాసిడ్ పడి ప్రమాదకరంగా మారడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న హనుమాన్‌జంక్షన్ ఫైర్ ఆఫీసర్ వి.అమరేశ్వరరావు సిబ్బందితో రహదారిపై పడిన యాసిడ్‌ను శుభ్రం చేయించారు. క్రేన్ సాయంతో ట్రక్కు ఆటోను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. షంషాద్ మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
‘క్విట్ కార్పొరేట్’ పేరుతో నిరసన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : ఆ నాడు బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టడం జరిగిందని, నేడు వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పటాన్ని వ్యతిరేకిస్తూ ‘క్విట్ కార్పొరేట్–క్విట్ మోదీ’ అనే నినాదంతో ఈ నెల13 తేదీన గుంటూరులోని లాడ్జి సెంటర్లో నిరసన కార్యక్రమం జరుగుతుందని రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, వ్యవసాయ విశ్రాంత శాస్త్రవేత్త వేణుగోపాలరావు వెల్లడించారు. గుంటూరు బ్రాడీపేటలోని పీఎల్‌రావు భవన్‌లో శుక్రవారం అఖిల పక్ష రైతు కార్మిక సంఘాల సమావేశం పాటి బండ్ల కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగానికి నష్టం చేసే మార్కెట్ చట్టం రద్దు చేయించాలని, అందుకు రైతాంగాన్ని కదిలించాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు లాడ్జి సెంటర్లో నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు మన్నవ హరిప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎం. హనుమంతరావు ,ఏ. అరుణ్ కుమార్ , కౌలు రైతు సంఘం నాయకులు పాశం రామారావు, బి.రామకృష్ణ. కె.జగన్నాథం కే.విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సిబ్బందిపై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని గుండయ్యతోటలో రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...డిప్యూటీ తహసీల్దార్ ఆదేశాల మేరకు ఈనెల ఆరో తేదీన పసుమర్రు సచివాలయం–1 సర్వేయర్ విద్యాసాగర్, వీఆర్వో కె చంద్రశేఖర్, వీఆర్‌ఏ ఆశీర్వాదం తమ పరిధిలోని సర్వే నంబర్లు 803, 807లో స్థితిగతులు పరిశీలించేందుకు వెళ్లి సదరు భూమికి సంబంధించిన ఫొటోలు తీస్తుండగా, అక్కడే నివాసం ఉంటున్న సీహెచ్ శ్రీనివాసరావు, అతని ఇద్దరు కుమారులు ఎందుకని ప్రశ్నించగా వారిమధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులపై ఘర్షణకు దిగిన ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టు హాజరుపరిచినట్లు సీఐ పి. రమేష్ తెలిపారు.
13న గుంటూరు లాడ్జి సెంటర్‌లో
కార్యక్రమం
రైతు, కార్మిక సంఘాల పిలుపు

యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా