
ఇక సెలవు !
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శంకర్ విలాస్ ఆర్వోబీ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. 70 ఏళ్ల పాటు ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషించిన బ్రిడ్జి శాశ్వతంగా కనుమరుగు కానుంది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా శంకర్‌విలాస్ ఆర్వోబీ స్థానంలో నాలుగు లైన్లతో నూతన ఆర్వోబీని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం గత రెండు నెలలుగా భారీ వాహనాలను దారి మళ్ళింపు చేసింది. లారీలు, బస్సులను శంకర్‌విలాస్ ఆర్వోబీపైకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ విధంగా గత నెల రోజులకు పైబడి బ్రిడ్జిపై బైక్‌లు, కార్లు, ఆటోలు మినహా ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు వైపులా పిల్లర్ల నిర్మాణాలు చేపట్టడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల రాకపోకలు సాగిస్తుండగా, నిర్మాణ పనుల్లో భాగంగా శనివారం నుంచి అన్ని వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు. దీంతో ఇక శంకర్‌విలాస్ ఆర్వోబీ కనుమరుగు కానుంది. 70 ఏళ్ల పాటు సేవలందించిన మహా నిర్మాణం ఇక చరిత్రగా మిగిలిపోనుంది.
గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న శంకర్‌విలాస్ బ్రిడ్జి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గుంటూరు నగరంలో ముఖ్యమైన కూడలిగా మారడంతో పాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు రోజులో ఒక్కసారి కచ్చితంగా తలచుకునే అత్యంత కీలకమైన ప్రాంతంగా మారింది. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారుల నిత్య జీవితంలో అంతర్భాగమై సేవలు అందించిన శంకర్ విలాస్ నగర ప్రజల జీవితాల్లో ఒక భాగమైంది.
కాల గర్భంలోకి శంకర్ విలాస్ ఆర్వోబీ
నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభం
ఏడు దశాబ్దాలుగా వారధిగా నిలిచి.. గుంటూరు ప్రజలకు సేవలు
శంకర్ విలాస్ ఆర్వోబీ చరిత్ర
నగరానికి నడిబొడ్డున కోస్తా జిల్లాల ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు బ్రిటీషు పాలకులు 1848లో 11 ఎకరాల విస్తీర్ణంలో జీజీహెచ్‌ను నిర్మించారు. తరువాత కాలంలో దానికి అనుబంధంగా 1946లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభమైంది. నిత్యం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే ప్రజలు, ఇప్పటి బ్రిడ్జి స్థానంలో ఉన్న రైల్వే గేటు వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో దీనిని గమనించిన స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి మునిసిపల్ చైర్‌పర్సన్ నడింపల్లి నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 1958లో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మించారు. తద్వారా ప్రజల ఇక్కట్లను తొలగించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఇక సెలవు !