
అస్సెస్మెంట్ బుక్స్ తొలగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టిన అస్సెస్మెంట్ బుక్స్ వల్ల విద్యార్థులకు స్వయం ఆలోచన, సృజనాత్మకత లేకుండా చేసి, ఉపాధ్యాయులకు అసౌకర్యంతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయని, వాటిని తొలగించి పూర్వ పద్ధతిలోనే పరీక్షల విధానం ఉండాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖలీద్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్సెస్మెంట్ బుక్స్‌తో జరిగే నష్టాలను తెలుపుతూ, పూర్వ విధానంలో పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని శుక్రవారం గుంటూరు డీఈఓ సీవీ రేణుకకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కె.బసవలింగారావు మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన అస్సెస్మెంట్ బుక్స్‌లో నాలుగు ఫార్మేటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు నిర్వహించి వాటి సమాధానాలు అన్నీ ఒకే బుక్ లోనే రాయాలని, తద్వారా పునరావృతం అయిన ప్రశ్నకు జవాబు అదే బుక్‌లో ఉండటం వల్ల విద్యార్థులు చూసిరాత విధానానికి అలవాటు పడతారన్నారు. విద్యార్థులు చదవకుండా సొంత ఆలోచన, సృజనాత్మకత కోల్పోతారన్నారు. మొత్తంగా విద్యార్థులకు చూసి రాత విధానానికి దారితీస్తాయని తెలిపారు. పూర్వ పద్ధతిలో పేపర్ల పై జవాబులు రాస్తే, జవాబు పత్రాలను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి దిద్దేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. అంతే కాకుండా పరీక్షల అనంతరం సెలవులు వచ్చినప్పుడు మొత్తం బండిల్స్ ఒకేసారి ఇంటివద్ద దిద్దుకుని మరునాడు విద్యార్థుల పరిశీలనకు అందజేసేవారమన్నారు. నూతన అస్సెస్మెంట్ బుక్స్‌తో ఇంటికి తీసుకెళ్లే సౌకర్యాన్ని కొల్పోయామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల జవాబులకు ప్రతి స్పందనలను అస్సెస్మెంట్ బుక్ లోనే తెలపాలని చెప్పడం ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉపాధ్యాయులకు అదనపు పనితో ఏకాగ్రత దెబ్బతిని ఒత్తిడికి గురై బోధనపై ప్రభావం చూపుతుందన్నారు. డీఈఓని కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు జి.దాస్, పి.నాగశివన్నారాయణ, ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, పి.శివరామకృష్ణ, జహంగీర్, టి.భాస్కర్, మాలకొండయ్య, కృష్ణారావు, తదితరులు ఉన్నారు.
ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ డిమాండ్