జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: యువత మాదకద్రవ్యాలకు బానిసలవడం ఆందోళనకరమని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. జిల్లా స్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశాన్ని శుక్రవారం డీఆర్సీ సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్‌కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, అధికారులతో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు తమ స్వార్థం కోసం విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలు, జూనియర్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వాటి వివరాలు సంబంధిత పోలీస్‌స్టేషన్, తహసీల్దారులకు అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాల వినియోగంపై సమాచారం ఉంటే తమ దగ్గర్లో పోలీసులకు తెలియజేయాలన్నారు. జీజీహెచ్‌లో రీ హ్యాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు వైద్యులు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల అనర్థాలపై ప్రత్యేక పోస్టర్లు, ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబరు వివరాలను విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. శివారు ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భవనాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అవగాహనతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ నుంచి మాదకద్రవ్యాలకు సంబంధించి 15 కేసులు నమోదు చేసి, 42 మందిని అరెస్టు చేశామని వివరించారు. ఐదు వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. రిపీటెడ్‌గా మాదకద్రవ్యాలు విక్రయించే వారిని 96 మందిని గుర్తించామన్నారు. నలుగురిపై పీడీ యాక్ట్, 15 మందిపై పీఐడీఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ద్వారా 108 విద్యా సంస్థల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఎవరైనా తప్పుడు మార్గాల్లో వెళ్లి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ కోరారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డీఈఈ రేణుక, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు వెస్ట్: విలువైన ప్రాణాన్ని నిర్లక్ష్యంతో పోగొట్టుకోకూడదని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, అధికారులతో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఐ–ఆర్‌ఏడీ యాప్‌లో రవాణా, పోలీసు, రహదారులు, వైద్య శాఖల వారు ప్రమాదాల వివరాలు, తనిఖీలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. అధికారులు గుర్తించిన 52 బ్లాక్ స్పాట్‌లు వద్ద తక్షణం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారులపై వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని సిగ్నల్ లైట్ల వద్ద జీబ్రా లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారి సమీపంలో ఉండే ట్రామా కేర్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, జాతీయ రహదారుల పి.డి. పార్వతీశం, జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.