
నైపుణ్యంతో కూడిన విద్యాబోధన అవసరం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థి కేంద్రంగా నైపుణ్యంతో కూడిన విద్యాబోధనను ఉపాధ్యాయులకు సాగించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు. సదరన్ ప్రైవేట్ లెక్చరర్, టీచర్ ఆర్గనైజేషన్ (ఎస్‌పీఎల్‌టీఓ) ఆధ్వర్యంలో శుక్రవారం ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు మనోవిజ్ఞాన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలను వివరించారు. తరగతి గదిలో విద్యార్థి కేంద్రీకృత విద్యా బోధన జరగాలన్నారు. ఉపాధ్యాయుడే విద్యార్థికి లక్ష్య నిర్దేశకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విజయవాడలోని ఎడ్యుకేషనల్ టీచర్ రీసెర్చ్ కౌన్సెలింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.రామశేషాద్రిరావు మాట్లాడుతూ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల మానసిక స్థితిని గమనించి విద్యాబోధన సాగించాలని సూచించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. జీకేఆర్ స్కూల్ డైరెక్టర్ జి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల మానసిక స్థితిలో మార్పులను తీసుకురావడంతోపాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొదించుకోవడంలో శిక్షణ తరగతులు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌పీఎల్‌టీఓ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య, కార్యదర్శి ఎం.రాకేష్, కళాశాల విభాగ అధ్యక్షుడు కావూరి గోవిందరాజులు, జిల్లా, రాష్ట్ర స్థాయి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు