జిల్లా వ్యాప్తంగా వర్షాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా వర్షాలు

Jul 26 2025 8:39 AM | Updated on Jul 26 2025 9:14 AM

జిల్లా వ్యాప్తంగా వర్షాలు

జిల్లా వ్యాప్తంగా వర్షాలు

చేబ్రోలులో 22.6 మి.మీ. వర్షం సగటున 12.4 మి.మీ. వర్షపాతం

కొరిటెపాడు(గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా చేబ్రోలు మండలంలో 22.6 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా ప్రత్తిపాడు మండలంలో 5.4 మి.మీ వర్షం పడింది. సగటున 12.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు పశ్చిమలో 18.4 మి.మీ., తెనాలి 17.2, పెదనందిపాడు 14.8, కొల్లిపర 14.6, గుంటూరు తూర్పు 14.4, కాకుమాను 13.2, దుగ్గిరాల 12.8, తుళ్ళూరు 12.4, పొన్నూరు 11.6, మేడికొండూరు 10.4, పెదకాకాని 10.2, తాడేపల్లి 9.8, మంగళగిరి 9.4, ఫిరంగిపురం 9.2, తాడికొండ 8.6, వట్టిచెరుకూరు మండలంలో 8.4 మి.మీ చొప్పున వర్షం పడింది. జూలై 25వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 133 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 211.8 మి.మీ వర్షపాతం నమోదైంది.

అన్ని వర్గాలకు అందుబాటులో దూరవిద్య

గుంటూరు ఎడ్యుకేషన్‌: సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వైవిధ్యమైన దూరవిద్య కోర్సులను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందిస్తోందని ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.శరత్‌చంద్ర అన్నారు. శుక్రవారం ఎన్జీవో కాలనీలోని మహాత్మాగాంధీ కళాశాలలో ఇగ్నో కోర్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శరత్‌చంద్ర మాట్లాడుతూ దేశంలో అత్యధిక మంది విద్యార్థులు, అనేక కోర్సులతో విద్యను అభ్యసిస్తున్న ఉన్నతమైన విశ్వ విద్యాలయంగా ఇగ్నో గుర్తింపు పొందినట్లు చెప్పారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రంగా మన రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఇగ్నో సేవలు అందిస్తోందని, డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సివిల్స్‌ స్థాయికి తగిన పాఠ్య ప్రణాళికతో కూడిన అంశాలు ఇగ్నో ప్రత్యేకతలు అని, ఒకే విద్యా సంవత్సరంలో ఒక రెగ్యులర్‌ కోర్సుతో పాటు దూరవిద్యా విధానంలో ఆన్‌లైన్‌లో మరొక కోర్సు అభ్యసించే వీలుందని తెలిపారు. కార్యక్రమంలో గౌతమి విద్యాసంస్థల చైర్మన్‌ కనుమర్ల గుండారెడ్డి, ప్రిన్సిపాల్‌ పి. ఉదయ్‌కిరణ్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎంఎం నాయక్‌ సస్పెన్షన్‌

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌) : గుంటూరు నగరపాలక సంస్థ మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో సిటీ మిషన్‌ మేనేజర్‌ (సీఎంఎం)గా పని చేస్తున్న నాయక్‌, మెప్మాలో పనిచేస్తున్న ఓ రిసోర్స్‌ పర్సన్‌(ఆర్‌పీ) అశ్లీల చిత్రాన్ని సీఓ, సీఎంఎంల వాట్సాప్‌ గ్రూప్‌లో గత కొద్ది రోజుల కిందట పోస్ట్‌ చేసి డిలీట్‌ చేశాడు. ఈ లోపు చాలా మంది ఆ చిత్రాన్ని చూసి, మెప్మా ఎండీ తేజ్‌భరత్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సీఎంఎంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి, చర్యలు తీసుకోవాలని మెప్మా పీడీ విజయలక్ష్మీని ఆదేశించారు. సీఎంఎం నాయక్‌ను సస్పెండ్‌ చేశామని పీడీ ‘సాక్షి’కి తెలియజేశారు.

7న జిల్లా స్థాయి జావెలిన్‌ త్రో పోటీలు

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వచ్చే నెల 7వ తేదీన అండర్‌–14, 16, 18, 20, 23, బాలబాలికలు, సీనియర్‌ పురుషులు, మహిళల జిల్లా స్థాయి జావెలిన్‌త్రో పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్‌ కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక బీఆర్‌ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు స్టేడియంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement