
గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్
నెహ్రూనగర్ : కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో శనివారం ప్రకటించిన సర్వేక్షణ్ అవార్డుల్లో గుంటూరు నగరం స్థానం సాధించిందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇందులో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు నగరం స్థానం దక్కించుకుందని వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని విద్యా భవన్‌లో ఈ నెల 17న రాష్ట్రపతి అవార్డ్‌లను అందిస్తారని, తనతో పాటు మేయర్ వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో నగరం నిలవడానికి కృషి చేసిన ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గం ఎన్నిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ (జీటీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎంఎం షరీఫ్, డి. యల్లమందరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జీటీఏ ఉమ్మడి గుంటూరుజిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా రమాదేవి, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రభాకర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా చలపతిరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ.విజయకుమార్, సంయుక్త కార్యదర్శిగా పి. రమేష్‌బాబు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ. దశరఽథ్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా ప్రశాంత్‌బాబు నియమితులయ్యారు.
ఇసుక అక్రమ తవ్వకాలను సహించం
మంత్రి మనోహర్
కొల్లిపర: ఇసుక అక్రమ తవ్వకాలను సహించేది లేదని, సొంత పార్టీ వాళ్లయినా అక్రమానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కృష్ణానది నుంచి ఇసుక తరలింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి రావడంతో శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రారంభంలో ఇసుక నిల్వ.. ప్రస్తుతం అనే అంశాలపై రేపటిలోగా తనకు నివేదికను అందించాలని ఆదేశించారు. నదిలో అర్ధరాత్రి మిషన్లతో తవ్వకాలు జరుగుతున్నారని తనకి సమాచారం వచ్చిందని, దీనిపై సమాధానం చెప్పాలని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులను ఆయన ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోయేసరికి వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలు విషయం తేలే వరకు డంపింగ్ యార్డ్ నుంచి ఇసుకను తరలించవద్దని అధికారులను ఆదేశించారు.
పులిచింతలకు 20,077 క్యూసెక్కులు విడుదల
సత్రశాల (రెంటచింతల): సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి, రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తం 20,077 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్‌కో ప్రాజెక్టు డ్యామ్ ఈఈ సుబ్రమణ్యం, ఏడీఈ ఎన్.జయశంకర్ శనివారం తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా 8,757 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతలకు విడుదల చేసి 1.874 ఎంఎం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు 2 క్రస్ట్‌గేట్ల ద్వారా 11,320 క్యూసెక్కులు వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు పూర్తి స్థాయి 75.50 మీటర్లకు నీరు చేరుకుందని, రిజర్వాయర్‌లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు.

గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్