
వెబ్–ఆప్షన్ల నమోదుకు వేళాయె !
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కీలక దశ ఆదివారం ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మేలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025) జరిగింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో భాగంగా ఆదివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులంతా దీనికి సిద్ధం కావాలి. ఈఏపీసెట్ నోటిఫికేషన్‌లో పొందుపర్చిన జాబితాలో పేర్కొన్న విధంగా ధ్రువపత్రాల పరిశీలన విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లకు సన్నద్ధం కావాలి. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులకు ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు అవకాశం ఉంది.
వెబ్ ఆప్షన్ల నమోదులో
అప్రమత్తత అవసరం
● వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు విద్యార్థులు ఇంట్లోని సొంత కంప్యూటర్‌తో పాటు ప్రైవేటు ఇంటర్‌నెట్ కేంద్రాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవచ్చు.
● ఆప్షన్ల నమోదు ప్రక్రియలో విద్యార్థులు వివరాలను గోప్యంగా ఉంచుకోవాలి.
● హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ ఐడీ, ఇతర కాన్ఫిడెన్షియల్ వివరాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంచకుండా జాగ్రత్తలు పాటించాలి.
● విద్యార్థులను చేర్చుకునేందుకు పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఇప్పటికే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సర్టిఫికెట్లు తీసుకుని, తమ కళాశాలకు వస్తే గ్యారంటీగా సీటు వచ్చే విధంగా చూస్తామని సిబ్బంది ద్వారా ఫోన్లు చేయిస్తున్నాయి. ఇటువంటి ప్రలోభాలకు లొంగవద్దు.
● ర్యాంకు ఆధారంగా, నచ్చిన కళాశాలలతో పాటు బ్రాంచ్‌లకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమో దు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గత ఏడాది కటాఫ్ వివరాలు
ఏపీ ఈఏపీసెట్ సైట్‌లో అధికారులు గతేడాది కళాశాలల వారీగా ర్యాంకు, కటాఫ్ వివరాల జాబితా అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ర్యాంకులు, రిజర్వేషన్లు అనుసరించి 2024లో భర్తీ చేసిన సీట్ల వివరాలను పొందుపర్చారు. వీటి ద్వారా విద్యార్థులు ఒక అవగాహన వస్తుంది. ఏపీ ఈఏపీసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో పలువురు జేఈఈ అడ్వాన్స్‌డ్, మెయిన్స్‌లోనూ జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వీరంతా ఐఐటీ, ఎన్‌ఐటీలకు వెళ్లిపోవడంతో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ ప్రవేశాలు పొందారు.
ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కీలక దశ ప్రారంభం రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు అవకాశం 18వ తేదీ వరకు కొనసాగనున్న వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 36 కళాశాలల్లో 30,240 సీట్లు
సీట్ల వివరాలు
గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లోని 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 30,240 సీట్లు ఉన్నాయి.
రెండు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు 34 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 29,460 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలో 23,536 మంది విద్యార్థులు అర్హత సాధించారు.