
ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ చర్యల వల్ల ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6400 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను ఉన్నత చదువుకున్న దూరం చేసే జీవో నంబర్ 77 రద్దు చేయాలని, డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన కోరారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు. అందులో భాగంగా గుంటూరు నగరంలో వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించి, డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తానని చెప్పిన లోకేష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర గరల్స్ కన్వీనర్ బాల నవ్యశ్రీ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉద్యోగాలు వచ్చినా వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తయి మూడు నెలలు కావస్తున్నా నేటికీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివ, సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర కార్యదర్శి అజయ్, రాహుల్, ఆనంద్, డేవిడ్, సాగర్, తేజ, కిరణ్, పవన్, ప్రణీత్ తపాల్గొన్నారు
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ ఆగ్రహం